రామాయంపేట, జూన్ 5 : కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో మొలకెత్తిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పద్మాదేవేందర్‌రెడ్డితో తమ గోడువెళ్లబోసుకున్నారు. ఒక్క గ్రామంలోనే రోడ్డు పొడవునా 2 కిలోమీటర్ల మేర ధాన్యం కుప్పలు ఉండటం చూసి చలించిపోయారు. వానకాలం వచ్చినా ప్రభుత్వం ధాన్యం కొనకుండా ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి రెండు నెలలు కావస్తున్నా, ఇంకెప్పుడు కొంటారని నిలదీశారు. రాయిలాపూర్‌లోని మూడు కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్నదని మండిపడ్డారు. అక్కడి నుంచే మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్‌తో ఫోన్లో మాట్లాడినా సమస్యకు పరిష్కారం దొరుకలేదు.
దీంతో ఆమె రాయిలాపూర్ నుంచే కార్యకర్తలు, రైతులతో 3 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి క్రాస్ రోడ్డు వద్ద సిద్దిపేట-రామాయంపేట రోడ్డుపై బైఠాయించారు. రైతుల ధాన్యం కొనే వరకు కదిలేదని భీష్మించారు. రెండు గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. రామాయంపేట, నిజాంపేట ఎస్సైలు బాలరాజు, రాజేశ్ వచ్చి సముదాయించినా పద్మాదేవేందర్‌రెడ్డి ససేమిరా అన్నారు. ఎస్సై బాలరాజు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారితో ఫోన్లో మాట్లాడించారు. రాత్రి వరకు ఐదు లారీలు పంపిస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఒకవేళ లారీలు రాకపోతే శనివారం వచ్చి రాస్తారోకో చేపడుతానని పద్మాదేవేందర్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగక రైతులు ఇబ్బందులు పడుతుంటే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎక్కడికిపోయారని, ఈ ఎమ్మెల్యేకు రైతుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు. రెండు నెలలుగా రైతులు ధాన్యంతో రోడ్లపై ఉంటే కనికరం చూపకపోవడం దారుణమని అన్నారు.