హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తేతెలంగాణ): కామారెడ్డి జిల్లా కేంద్రం, ఎల్లారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనతో వరద బాధితులకు ఒరిగిందేమీలేదని, కనీస ఉపశమనం కూడా లభించలేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. వరదల కారణంగా నియోజకవర్గంలో నష్టపోయిన 18 వేల మంది రైతులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని, యాసంగి సీజన్లో ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే ఊరుకొనేది లేదని బీఆర్ఎస్ బాధితుల తరుఫున పోరా టం చేస్తుందని హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు శుభప్రద్‌పటేల్, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
సీఎం రాక సందర్భంగా తనతోపాటు బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్‌లో రెండు చెరువులు తెగిపోయి జలదిగ్బంధంలో చిక్కుకున్న అనేక తండాలను సీఎం సందర్శించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి రైతులంటే అంత చులకనెందుకు? వారు మనుషులు కారా? సాయం అందించేందుకు చేతులు రావడంలేదా? అని ప్రశ్నించారు. విహారయాత్రకు వచ్చినట్టు సీఎం, మంత్రులు వచ్చి రూ.10 లక్షలు నష్టం జరిగిన చిన్న బ్రిడ్జిని చూసిపోయారని, సుమారు 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. యూరియా కోసం క్యూలైన్లలో ఉన్న రైతులను సినిమా టికెట్ల కోసం నిలబడ్డ వారితో పోల్చడం బాధాకరమని పేర్కొన్నారు.
తులంటే కాంగ్రెస్ సర్కారుకు ఎందుకంత అలుసు? అని నిలదీశారు.
సీఎంకు డిసెంబర్ ఫోబియా: బాలరాజుయాదవ్
సీఎం రేవంత్‌రెడ్డికి డిసెంబర్ ఫోబియా పట్టుకున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు స్థానిక, రెండేండ్ల తర్వాత సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చేపట్టే అభివృద్ధి పనులతోపాటు ఎస్ఎల్బీసీని పూర్తిచేసేందుకు డిసెంబర్ గడువు పెట్టుకుంటున్నారని విమర్శించారు. యూరియా కోసం లైన్లలో నిల్చున్న రైతులను అవమానించేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌నాయక్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.