హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటిపైనా కేసులు పెట్టడమా? అని బీఆర్ఎస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం పోయి, ఇందిరమ్మ రాజ్యాంగం వచ్చిందా? అని నిలదీశారు. జై తెలంగాణ అంటే జైల్లో పెడుతున్నారని, నిజం చెప్తే నిర్బంధిస్తున్నారని, మొత్తంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌రావు సహా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, నేతలు కొణతం దిలీప్, క్రిశాంక్ తదితరులు ఎందరిపైనో కేసులు పెట్టారని తెలిపారు. 60 లక్షలకు పైగా ఉన్న బీఆర్ఎస్ సైన్యాన్ని జైళ్లో పెట్టగలరా? అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టాలని పోలీసులకు టార్గెట్లు పెడుతున్నారని, కేసులు పెట్టని పోలీసు అధికారులను వేధిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఇదే విధంగా కేసులు పెట్టి ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఉండేదే కాదని చెప్పారు. దీనిపై మేధావులు స్పందించాల్సిన అవసరం వచ్చిందని, లేదంటే రాష్ట్రం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
షాడో సీఎంగా మీనాక్షి నటరాజన్
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ షాడో సీఎంగా రాష్ట్ర సచివాలయంలో వ్యవహారాలు చక్కపెడుతుంటే.. డమ్మీ సీఎంగా రేవంత్‌రెడ్డి మాత్రం కమాండ్ కంట్రోల్ నుంచి పాలన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ ఒక బ్రాండ్‌గా మారిస్తే, సీఎం రేవంత్ మాత్రం కేసుల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. బీజేపీకి సీఎం రేవంత్‌రెడ్డి కోవర్టు అని ఆరోపించారు. రాష్ట్రంలో నాడు కేసీఆర్ జనహిత పాలన అందిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి నియంత పాలన చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అరాచకాలను పింక్‌బుక్‌లో నమోదు చేసుకుంటున్నామని హెచ్చరించారు.