లింగాలఘనపురం, జూలై 6 : దొంగే.. దొంగ..దొంగ అన్న చందంగా సీఎం రేవంత్‌రెడ్డి తీరు ఉన్నదని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం జనగామ జిల్లా లింగాలఘనపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ.. ప్రజల కిచ్చిన హామీల అమలుపై ప్రెస్‌క్లబ్ లేదా కొండారెడ్డిపల్లి, కొడంగల్, చింతమడక, గజ్వేల్‌లో ఎక్కడ చర్చ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ తరఫున సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరితే.. దాన్ని స్వీకరించే దమ్ములేక.. రేవంత్‌రెడ్డి ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నాడని విమర్శించారు. రైతాంగానికి రుణమాఫీ కింద రూ.38 వేల కోట్లు, రైతుబంధు రూ.39 వేల కోట్లు ఎగ్గొట్టాడని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం, స్కూటీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఆ పథకాల కోసం రాష్ట్రంలో 1.68 కోట్ల మంది ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
ఏడాదిన్నరలో ఒక్క ప్రాజెక్టుకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన 420 హామీలకు మంగళం పాడినందున ఓటర్లు రేవంత్‌రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని సూచించారు. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను రేవంత్ నమ్మడం లేదని అన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని తానై అభ్యర్థులను గెలిపించుకుంటానని అహంకారంతో మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదని చెప్పారు. గెలిచే సత్తా ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని తెలిపారు.