నార్కట్‌పల్లి, నవంబర్ 8: సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్రను ప్రజలు అడ్డుకుంటారనే భయంతో తమను ముందస్తుగా అరెస్టు చే యడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని తన నివాసం లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పరీవాహక ప్రాంతమైన సంగెం వద్ద పాదయాత్ర చేయడం కాదని, మూసీ బాధితుల వద్దకు వచ్చి చేయాలని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను నిర్బంధించి, పోలీసుల పహారా మధ్య పాదయాత్ర చేయడంపై మం డిపడ్డారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుడుల చుట్టూ తిరిగి మంచి చేస్తానని చెప్పి ఇప్పుడు చెడు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్‌రెడ్డి.. మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్‌రావుపై ఆరోపణలు చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. సమావేశంలో రైతు బంధు సమితి మండల మాజీ కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, పలువురు మాజీ సర్పంచ్‌లు ఉన్నారు.