వేములవాడ, జూలై 5 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చెన్నమనేని రమేశ్‌బాబు పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తూ వేములవాడ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రాధాబాయి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. జర్మనీ పాస్‌పోర్టు ఉన్న చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని హైకోర్టు నిరుడు డిసెంబర్లో తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆయన పేరును ఎన్నికల జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు జూన్ 24న నోటీసులు జారీచేసి.. వేములవాడలోని ఆయన ఇంటి గోడకు అంటించడంతోపాటు, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపారు.
అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరగా, నిర్ణీత గడువులోగా జవాబు ఇవ్వకపోవడంతో చెన్నమనేని పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఆర్డీవో ఉత్తర్వులు జారీచేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు తనయుడైన రమేశ్‌బాబు.. 2009లో టీడీపీ తరఫున వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీడీపీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి రెండోసారి గెలుపొందారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. 2023 డిసెంబర్లో పార్టీ నిర్ణయం మేరకు పోటీకి దూరంగా ఉండి.. అనంతరం జర్మనీలోనే ఉంటున్నారు.