హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ నాయకులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కలిసిపనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో దేశంలోనే రేవంత్‌రెడ్డి మొదటి వరుసలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి వేదికలు పంచుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి జీన్స్‌లోనే ఆరెస్సెస్ భావజాలం ఉన్నదని, తనది అదే స్కూల్ అని స్వయంగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ సీఎంగా, బీజేపీ నేతలు బీజేపీ సీఎంగా భావిస్తున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, బీజేపీ వేర్వేరు కాదని, రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసేపనిచేస్తున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలో చీకట్లు కమ్ముకున్నాయని సుమన్ విమర్శించారు. నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తే.. కాంగ్రెస్ హయాంలో పారిశ్రామికవేత్తలకు గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసున్నదని మండిపడ్డారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరమ్మ రాజ్యంలో బందీ చేశారని విమర్శించారు. దళితుల మీద దాడులు జరుగుతున్నాయని, దళిత మంత్రిని పట్టుకొని సహచర మంత్రులు ఏవిధంగా మాట్లాడారో చూశామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలుచేశారో లేదో చెప్పి, జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్, పల్లె రవికుమార్, బీఆర్ఎస్ నేతలు బొమ్మర రామ్మూర్తి, కురువ విజయ్‌కుమార్, కట్ల స్వామియాదవ్ పాల్గొన్నారు.