హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బీఆర్ఎస్వీ సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సతీమణిపై అక్రమ కేసు పెట్టారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను జూబ్లీహిల్స్ ఠాణా ఎస్‌హెచ్‌వో ఖండించడం శోచనీయమని పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్-109 కింద కేసు పెట్టినట్టు ఆమెకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు బుకాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఎన్ఎస్ సెక్షన్-109 అంటే హత్యాయత్నం కేసు కా దా? అని నిలదీశారు. జూబ్లీహిల్స్ పోలీసులు వాస్తవాలను మరుగునపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొందరు పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ పాలన తెస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఎమర్జెన్సీ పాలన తెచ్చారని, బీఆర్ఎస్ను అణచివేసే కుట్రలకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు.
పోలీసులూ.. పద్ధతి మార్చుకోండి
సీఎం రేవంత్‌రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసులు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారని, కాంగ్రెస్‌కు ఓ చట్టం, బీజేపీకి మరో చట్టం, బీఆర్ఎస్కు ఇంకో చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు., కేటీఆర్, హరీశ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు భౌతికదాడులు చేసినా పోలీసులు కేసులు పెట్టకుండా వివక్ష చూపుతున్నారని విమర్శించారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ సోషల్‌మీడియా యాక్టివిస్ట్లపైనా కేసులు బుక్ చేయడం శోచనీయమని పేర్కొన్నారు. కొందరి పోలీసుల తీరుతో తెలంగాణ పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వస్తున్నదని మండిపడ్డారు. పోలీసులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్‌గౌడ్, చిరుమల్ల రాకేశ్, తుంగ బాలు పాల్గొన్నారు.