Rasamayi Balakishan | జయ జయహే తెలంగాణ.. రాష్ట్ర గేయంగా చేసేందుకు నాడు కేసీఆర్ మార్పులు, చేర్పులు చేద్దామంటే ఒప్పుకోని రచయిత అందెశ్రీ.. నేడు సీఎం రేవంత్‌రెడ్డికి తలొంచారని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతి సారథి మాజీ చైర్మన్, ప్రముఖ కళాకారుడు రసమయి బాలకిషన్ విమర్శించారు. కొన్ని మార్పులు, చేర్పులతో రాష్ట్ర గీతంగా చేయాలని కేసీఆర్ అడిగారని, దానికి అందెశ్రీ ఒప్పుకోనంటూ వెళ్లిపోయారని, దానికి తానే ప్రత్యక్ష సాక్షినని తేల్చిచెప్పారు. ఈ విషయం నాటి జేఏసీ చైర్మన్ కోదండరాంకు కూడా తెలుసని, ఇప్పుడు ఎందుకు నోరు విప్పుతలేరని ప్రశ్నించారు. అదే గీతానికి నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మార్పులకు ఎలా ఒప్పుకున్నారని అందెశ్రీని ప్రశ్నించారు. ఆనాడు రాష్ట్ర గేయంగా కాకపోవడానికి ముమ్మాటికీ అందెశ్రీయే కారణమని స్పష్టం చేశారు. మార్పు అంటే లోగోలు, తోరణాలు మార్చడం కాదని, ప్రజాభీష్టంగా పాలించడమని సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ‘పోరాటం ఇంకా మిగిలే ఉన్నది’ అనే విషయం తేటతెల్లం అవుతున్నదని అభిప్రాయపడ్డారు. పది వసంతాల తెలంగాణ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో రసమయి బాలకిషన్ ఉద్యమం, అనంతర కాలంనాటి పలు విషయాలను పంచుకున్నారు.
రసమయి బాలకిషన్ : (చేతులు జోడించి) అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణలో జరుగుతున్న అవిశ్రాంత పోరాటాలకు ఒక సాంస్కృతిక ఉద్యమం తోడైతే ప్రజల్లో చైతన్యం వస్తుందనేది నాటి ఉద్యమ సారథి కేసీఆర్ ఆలోచన. ఓసారి నా పాట ఆవిష్కరణకు రవీంద్రభారతికి కేసీఆర్ వచ్చారు. సుద్దాల అశోక్‌తేజ, భారతి, అందెశ్రీ, గూడ అంజన్న, గోరటి వెంకన్న, దయా నర్సింగ్, జయరాజు వంటి ఎంతోమందితో ఆ రోజు ఐదుగంటలపాటు సాంస్కృతిక ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన చూసిన కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే సాంస్కృతిక ఉద్యమం. దాన్ని ఒక ఆయుధంగా గ్రామగ్రామానా తీసుకెళ్లినం. గ్రామల్లోని కవులు, కళాకారులను కలుపుకున్నాం. ‘ధూంధాం’లతో తెలంగాణ రాష్ట్ర సాధనకు సాంస్కృతిక ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లినం. ఆ పోరాటాల తెలంగాణ నుంచి దేశం మొత్తం తలెత్తిచూసిన అభివృద్ధి తెలంగాణను చూసిన. నా జన్మధన్యమైంది. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ‘పోరాటం ఇంకా మిగిలే ఉన్నది’ అనేది మళ్లీ గుర్తుకొస్తున్నది.
2001 సెప్టెంబర్‌లో జయశంకర్ సార్, కేసీఆర్ సార్‌తో చర్చల తర్వాత పాశం యాదగిరి, చింతస్వామి, మురళీమధు, నాగరాజు సహకారంతో మొదటి ధూంధాం కామారెడ్డిలో పెట్టినం. అంతా జన ప్రభంజనం. సుద్దాల అశోక్, భారతి, అందెశ్రీ, గూడ అంజన్న, గోరటి వెంకన్న, దయానర్సింగ్, జయరాజు వంటి కవులు, కళాకారులంతా ఒకే వేదికపై ఉండటం, తెలంగాణ బతుకు, కన్నీటిని, పోరాటాలను ఒక్కో పాటలో ఆవిష్కరిస్తుంటే జనం తెల్లారిందాంకా చూస్తుండిపోయారు. అప్పటివరకు సామాజిక అంశాలపైనే పాటలు రాసిన వాళ్లంతా.. పోరాటాలు, తెలంగాణ రావాల్సిన ఆవశ్యకత, కొత్త పోరాట పంథాలు, దీన బతుకులపై పాటలు, సాహిత్యం రాయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత సంగారెడ్డి, సిద్దిపేట, లలిత కళాతోరణం (2006)లో పెట్టిన ధూంధాం సభలకు గద్దర్ వచ్చిండు. మా పాటలతో, ఆటలతో రాజకీయ నాయకుల్లో చలనం తీసుకొచ్చి, రాజీనామాలు చేయించేలా చేసినం. ఆ తరహా వ్యూహరచనకు ఉద్యమసారథి కేసీఆర్ ఆద్యుడు. ప్రజల కోరిక మేరకు నాటి టీఆర్ఎస్ నేతలు రాజీనామాలను గడ్డిపోచల్లా విసిరేశారు. కోదారి శ్రీనివాస్, వరంగల్ శ్రీనివాస్, భిక్షపతి, ఏపూరి సోమన్న, కిశోర్, మిట్టపల్లి సురేందర్, సాయిచంద్ ఒక్కొక్కరిది ఒక్కో పాటల పంథా. ఉద్యమ సమయంలో ధూంధాంలతో ఓలలాడించినం.
అప్పుడు, ఇప్పుడూ.. పాటను, కళాకారులను పట్టించుకున్నది కేసీఆర్ ఒక్కరే. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి మమ్మల్ని పాటలే పాడనియ్యకపోయ్యేది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న గోరటి వెంకన్న.. గొంగడి భుజాన వేసుకొని, వలసవాదులపై పాటలు ఎక్కుపెట్టిండు. అన్నకు తోడు సింగరేణి ఉద్యోగి జయరాజు అన్న. అప్పటికి నేనొక టీచర్‌ను. నాతోపాటు దేశపతి వంటి మరికొంతమంది.. మేము ఎవ్వరం ఉద్యోగాలను లెక్కచేయలేదు. పాటలను పాడనివ్వని పరిస్థితుల్లో కేసీఆర్ కదా మాకు అండగా ఉన్నది. ఆయన లేకపోతే మా పాటలు పాడనిచ్చేవారా? మేము చేసిన ప్రతి ధూంధాం వెనుక కేసీఆర్ శ్రమ ఉన్నది.
ఆ నాడు పాటమొత్తం రాసి కేసీఆర్ దగ్గరకు వెళ్లి వినిపించినం. ఒక తల్లి సెంటుమెంట్తో ఆయన కొన్ని మార్పులు, చేర్పులు చెప్పిండు. మళ్లీ రాయించినం. మళ్లీ కొన్ని చెప్పిండు.. అందెశ్రీ ఒప్పుకోలేదు. అప్పటికే ఆ పాట వేదికల మీదికి వచ్చింది. తెలంగాణ ప్రజలంతా ఇది మన గీతమని పాడుకుంటుడ్రు. నేను 2004లో క్యాసెట్ రూపంలో తీసుకొద్దామని అనుకుంటుంటే ఎలాంటి మార్పులు చెయ్యొద్దని అందెశ్రీ చెప్పిండు. ఇప్పుడున్న పాటకు, అప్పుడున్న పాటకు కొన్ని మార్పులు ఉన్నాయి. ‘కాకతీయుల కాంతిప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్’ వంటివి కొన్ని లేవు. మార్పులు చేర్పులను ఇష్టపడని అందెశ్రీ.. కేసీఆర్‌తో మాట్లాడకుండనే వెళ్లిపోయిండు. ఇప్పటికీ ‘జయజయహే తెలంగాణ’ అనేది మన ప్రార్థనా గీతం అని అనుకున్నాం. ప్రజలు నిర్ణయించుకున్న ఈ పాటనే కొన్ని మార్పులతో రాష్ట్ర గీతంగా చేయాలని కేసీఆర్ అడిగితే.. మార్పులు చెయ్యనని అందెశ్రీ నాడు తెగేసి చెప్పిండు.
‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతమని అప్పట్నుంచి ఇప్పటివరకూ ప్రజలంతా పాడుకుంటున్నారు. దాన్ని ప్రజలు సొంతం చేసుకున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఓ కొత్త గీతం తీసుకొస్తే ప్రజలు ఆమోదిస్తారా? ఇంకెన్ని కొత్త వాదనలు వచ్చేవి? కొద్దిపాటి మార్పులతో ఆ పాటను రాష్ట్ర గీతంగా ఆమోదిద్దామంటే ఆయన అస్సలు ఒప్పుకోడాయె. ఓ పాట రాష్ట్ర గీతంగా వచ్చేటప్పుడు సొంత వ్యక్తీకరణ ఉండదు కదా. అప్పుడు కూడా ఒక పల్లవి, నాలుగు చరణాలు ఉండాలనుకున్నాం. ఆయన పూర్తిగా ఉండాలన్నారు. ఆయన ఒప్పుకోనప్పుడు మనమేంజేద్దాం’ అని కేసీఆర్ అన్నడు. అది రాష్ట్ర గీతం కాకపోవడానికి అందెశ్రీయే కారణం. దానిని అందెశ్రీ ఎందుకు ఒప్పుకోలేదో కోదండరామ్‌కు కూడాతెలుసు కదా. ఇవ్వాళ ఎందుకు నోరు విప్పుతలేరు? ఎంతోమంది సాహిత్యకారులు ఉన్నారు.. కేసీఆర్ అనుకుంటే ఎవరితోనైనా పాట రాయించి.. ప్రార్థనా గీతంగా పెట్టేవారు.
అందెశ్రీ ‘దొర తెలంగాణ’ అన్నడు. రేవంత్‌రెడ్డి ఆయనకంటే పెద్దదొర కదా. అప్పుడు మేము మార్పులు, చేర్పులు చేద్దామంటే ఇట్లాగే ఉండాలని అన్న అందెశ్రీ.. ఇవ్వాళ రేవంత్‌రెడ్డి దగ్గర మోకరిల్లి ఎందుకు మార్పులకు ఒప్పుకున్నాడు? నాడు మార్పులకు అంగీకరిస్తే 2014 తొలి అవతరణ వేడుకల్లోనే ఇది రాష్ట్రగీతం అయ్యేది. నాడు ఉద్యమకారులపై లాఠీదెబ్బలు కొట్టిన, తుపాకీ తూటాలు వేసిన వారివైపే నేడు అందెశ్రీ చేరిండు. తెలంగాణ ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టినోడు రేవంత్‌రెడ్డి. ఆయన ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టినప్పుడే.. ‘లాఠీలు విరిగిన లడాయి మానం’ అని నువ్వే కదా రాసింది.
అప్పుడు మేమంతా ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా అమరుల స్మృతి గీతాలనే పాడేది. అప్పుడే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ ఉన్నట్టే మనకూ ఓ గీతం ఉండాలనుకున్నం. అప్పుడు అందెశ్రీకి నేనొక కథ చెప్పిన. ఏంటంటే.. నేను స్కూళ్లో ప్రార్థనా గీతం ముగించుకొని క్లాసుకు వెళ్లగానే ఓ విద్యార్థి ‘ఆదిలాబాద్ నుంచి కూడా కాల్వలు ఎండిపోతున్నయి. కృష్ణమ్మ బిరబిరా దుంకుకుంటా పోతుంది కానీ మన బంగారు పంటలెక్కడ పండుతున్నయ్ సార్’ అని ప్రశ్నించిండు. గోదావరి నీళ్లు, కృష్ణమ్మ నీళ్లు మనవి కావని, నాడున్న తెలుగుతల్లి మనది కాదని, కవులు, కళాకారులమంతా రగిలిపోయారు. అందెశ్రీతో మాట్లాడి అప్పటి ఉద్యమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే గీతం రాయించినం.
కేసీఆర్ కొన్నేండ్లపాటు ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి. రాష్ర్టాన్ని పదేండ్లు పాలించిన వ్యక్తి. ఏది బాగుంటుందో ఆయనకు తెలియంది కాదు. ఏ రాచరికపు వ్యవస్థలోనైనా మంచిని తీసుకోవడంలో తప్పు లేదు. అద్భుతమైన పరిపాలన కాకతీయులు అందించారు. ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ నిర్మించారు. మంచిని స్వీకరించు, చెడును వదిలెయ్. పేర్లు మార్చడం, గుర్తులను చెరిపేయడం కన్నా.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో శ్రద్ధ చూపితే.. ప్రజలు ఆదరిస్తారు. తెలంగాణలో నిజమైన పిచ్చి తుగ్లక్ ఉన్నారంటే ఒక్క రేవంత్‌రెడ్డి మాత్రమే. నువ్వు ఏమైనా చెయ్.. కానీ తెలంగాణ ఆత్మజోలికి వస్తే.. ఊరుకోం. ముఖ్యమంత్రి స్థాయి ఆలోచన గొప్పగా ఉండాలి కానీ.. చెత్తగా ఉండకూడదు. ‘జై తెలంగాణ’.