మోర్తాడ్, అక్టోబర్ 9: రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీలు కపట రాజకీయాలు చేస్తూ బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో వేముల గురువారం ఓ ప్రకటనలో స్పందించారు. న్యాయస్థానాలపై నెపం నెట్టి కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ చిత్తశుద్ధి లేదని కపట ప్రేమను బయటపెట్టిందని, రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్ తెలివిగా డ్రామా లాడుతున్నదని మండిపడ్డారు.
‘చెల్లదని తెలిసినా బీసీలను మభ్యపెట్టే ఉద్దేశంతో రిజర్వేషన్ పెంపు జీవో జారీ చేసింది కాంగ్రెస్సే. ఆ తర్వాత పార్టీ అనుచరులతో కోర్టులో కేసు వేయించి ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కుట్ర చేసింది కూడా కాంగ్రెస్సే. ఈ ద్వంద నాటకం ఎవరి కోసమని, ఎవరిని పిచ్చోళ్లను చేయడానికి ఈ డ్రామాలు ఆడుతున్నవ్ రేవంత్‌రెడ్డి’ అని వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలంటే 10వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ తప్పనిసరి చేయాలన్న వాస్తవం తెలిసి కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో 42 శాతం అంటూ ఎన్నికల సమయంలో బీసీ ఓట్ల కోసం మోసం చేసిందని మండిపడ్డారు.
ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఇలా ఏ ఒక్కరూ అక్కడికి రాకపోవడంతోనే బీసీలపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఉభయ సభల్లో తీర్మానం చేసి గవర్నర్‌కి పంపితే ఆయన తొక్కిపెట్టడం, గతంలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే అక్కడా ఆమోదం తెలుపకపోవడం కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తున్నదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నిజాయితీగా పోరాటం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసే కపట రాజకీయాలకు తాము సహకరించబోమని తేల్చిచెప్పారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి బీసీలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోకుండా రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధితో పని చేయాలని డిమాండ్ చేశారు.