వేల్పూర్, జూబ్లీహిల్స్ జూన్ 21: పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారం, పదవులు లేకుంటే బతకలేమా? ఈ వయస్సులో పార్టీ మారడం మీకు భావ్యమా? అని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘కేసీఆర్ మీకు ఏం తక్కువ చేశారు?. మిమ్మల్ని ఎప్పుడూ లక్ష్మీ పుత్రుడని సంబోధిస్తూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పెద్దలు శ్రీనివాసరెడ్డి అంటూ ముందు వరుసలో ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మిమ్మల్ని మాకు ఆదర్శంగా చూపిస్తూ మీ గురించి గొప్పగా చెప్పేవారు.
వ్యవసాయ మంత్రిగా, శాసనసభాపతిగా మీకు సమున్నత స్థానం కల్పించారు.సీఎం డెవలప్మెంట్ నిధుల నుంచి అత్యధికంగా తీసుకున్నది మీరే. నేను హౌసింగ్ మినిస్టర్‌గా ఉన్నా, నా కంటే ఎక్కువ మీరు అడిగినన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బాన్సువాడకు ఇచ్చారు. ఇదంతా కేవలం కేసీఆర్ మీకు ఇచ్చిన ప్రాధాన్యత వల్లే కదా?. మీరు అత్యంత ఇష్టదైవంగా భావించే తెలంగాణ తిరుమల గుడికి కూడా అడిగినన్ని నిధులిచ్చారు.
ప్రాణం పోయే వరకు కేసీఆర్ వెంటే ఉంటానన్న మీరు, ఇప్పుడు ఆ తెలంగాణ తిరుమల శ్రీనివాసుడికి ఏం సమాధానం చెప్తారు’ అని ప్రశ్నలవర్షం కురిపించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసేందుకే వెళ్లిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు బీఆర్ఎస్ నేతలను ఎలా అరెస్టు చేస్తారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రశ్నించారు.