వికారాబాద్, ఫిబ్రవరి 2, (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీల అమలుపై యూ టర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటిదాకా 100 రోజుల్లో హామీలు అమలుచేస్తామన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలు అమలవుతాయని ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే, హామీలను అమలు చేయకుంటే ముక్కు నేలకు రాసి, సీఎం పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే రూ.14 వేల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు.
రెండు నెలల్లో రేవంత్‌రెడ్డి ప్రజలను ఎన్నిసార్లు కలిశారు? ఎన్ని సమస్యలను పరిష్కరించారో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు ఊరుకోరని, ఎక్కువ రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగదని స్పష్టంచేశారు. మొన్నటి ఎన్నికల్లో కారుకు స్పీడ్ మాత్రమే బ్రేక్ పడిందని, కరెంట్, తాగునీరు, సాగునీరు అందించేందుకు పదేండ్లు 24 గంటలు పనిచేశామని, అభివృద్ధి గురించి ఆలోచించి, పార్టీ గురించి పట్టించుకోలేకపోయామని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేందర్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మెన్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.