హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతులకు నాలుగు నెలలుగా కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించడంలేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. విజయ డెయిరీని బొందపెట్టి ఆంధ్రా డెయిరీలను పెంచి పోషించే కుట్ర జరుగుతున్నదా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి చెల్లింపులు చేసేవారమని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాలుగు నెలలుగా చెల్లింపులు చేయడంలేదని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాల రైతులు పరేషాన్లో ఉన్నారని అన్నారు. హైదరాబాద్‌లో 30 లక్షల లీటర్ల పాలు ప్రతి రోజూ వినియోగిస్తారని, తెలంగాణ నుంచి వస్తున్న ఐదు లక్షల లీటర్లుకు కూడా డబ్బులు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మిగతా 25 లక్షల లీటర్ల పాలు ఎకడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.
తెలంగాణ డెయిరీని బొందపెట్టి ఆంధ్రా డెయిరీలను పెంచి పోషించే కుట్ర జరుగుతుందా అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. విజయ డెయిరీ లో రూ.500 కోట్ల నెయ్యి, పాలపొడి ఇతర ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని, వాటి గడువు దాటితే రూ. 500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని యాదాద్రి దేవస్థానానికో, తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికో విక్రయిస్తే బాగుంటుందని సూచించారు. పాడి రైతులకు ఇవ్వాల్సిన నాలుగు నెలల బకాయిలు పదిహేను రోజుల్లోగా చెల్లించాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే పాడి రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.