హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సామాజిక న్యాయంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. మహారాష్ట్ర సదన్‌లో మంగళవారం నిర్వహించిన ఆలిండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ మూడో జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. 85 కోట్ల మంది బీసీలు, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు అన్నిరంగాల్లో సముచిత స్థానం ఉంటేనే దేశం ముందుకెళ్తుందని తెలిపారు. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం పెట్టాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఓబీసీలకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడాది సంబరాలను గ్రామాల్లో చేపడితే ప్రజాసమస్యలు తెలుస్తాయని హితవు పలికారు. దేశంలో బీసీలు 60 శాతానికి పైగా ఉన్నా అన్యాయమే జరుగుతున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ అయిన నరేంద్ర మోదీ పదేండ్లు ప్రధాన మంత్రిగా ఉన్నా బీసీలకు ఎలాంటి మేలు చేయలేకపోయారని విమర్శించారు. కేవలం ఇద్దరు బీసీ నేతలకు మంత్రి పదవులిచ్చి తెలంగాణలో తీవ్ర అన్యా యం చేశారని చెప్పారు. తెలంగాణలోని కులగణనను ప్రజలు విశ్వసించడం లేదని, ప్రజామోదయోగ్యంగా ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు.