హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఇంత నిర్బంధం మధ్య ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. అభ్యర్థులు కోరినట్టు 2 నెలలు పరీక్ష వాయిదా వేస్తే నష్టమేంటని నిలదీశారు. శనివారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 అభ్యర్థులు జీవో- 29పై ఉద్యమిస్తున్నారని, అభ్యర్థులను సచివాలయానికి పిలిపించుకొని మాట్లాడే సమయం సీఎంకు లేదా? అని నిలదీశారు.
గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, గజ్జెల నగేశ్, ముఠా జయసింహ, శ్రీనివాస్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డిపై దాడి చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని, వారిని ఇంకా విడుదల చేయకపోవడమేంటని ప్రశ్నించారు. విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగబోదని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ నేత ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ పొలిటికల్ బ్రోకర్‌గా, జోకర్‌గా మారారని విమర్శించారు. నిరుద్యోగులు తెలంగాణభవన్‌కు వచ్చి మొరపెట్టుకుంటే మద్దతిచ్చి అండగా నిలబడింది బీఆర్ఎస్ కాదా? కేటీఆర్ కాదా? అని నిలదీశారు. ఈ రోజు రోడ్డుపైకి వచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడే యత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మోదీకి ముగ్గురు తమ్ముళ్లని.. పెద్దోడు రేవంత్, నడిపోడు బండి , చిన్నోడు అరవింద్ అని ఎద్దేవా చేశారు. సమావేశంలో నేతలు తుంగ బాలు, కిశోర్‌గౌడ్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.