హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో మూసిన కల్లు దుకాణాలను 10 రోజుల్లోగా తెరవకుంటే లక్ష మందితో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని గౌడ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. కల్లు కల్తీ కాకుండా నివారించాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. తప్పు జరిగిన దుకాణాలపై చర్యలు తీసుకోకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని కల్లు దుకాణాలను మూసివేయించడం ఏమిటని ప్రశ్నించారు.
గ్రా మాల్‌లోకి మద్యం దుకాణాల విస్తరించడం, కల్లు దుకాణాల మూసివేత, కల్లుగీత వృత్తిని అవమానించడం, గౌడన్నల రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వంటి ప్రధాన అంశాలపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 45 గౌడ సంఘాల ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత వృత్తిదారులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వివిధ గౌడసంఘాల నేతలు నిరసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికుల జోలికొస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని గౌడ సంఘాల నాయకులు తీవ్రంగా హెచ్చరించారు.
కల్తీ కల్లు వెనుక లిక్కర్ మాఫియా ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డి మాండ్ చేశారు. లేదంటే లిక్కర్ మాఫియాకు పాల్పడిన వారి వివరాలను తామే బయటపెడతామని స్పష్టంచేశారు. గౌడన్నల నుంచి ప్రతినెలా ఓ ఎమ్మె ల్యే మామూళ్లు వసూలు చేస్తునట్టు తమ వద్ద వివరాలూ ఉన్నాయని, వాటిని కూడా మీడియా సమక్షంలో త్వరలో బయటపెడతామని వెల్లడించారు. 10 రోజుల్లో కల్లు దుకాణాలను తెరిపించాలని, లేకుంటే అన్ని ఉమ్మడి జిల్లాల పర్యటన చేయాలని, ఇందిరా పార్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని, అన్ని కులసంఘాల సమన్వయంతో లక్షలాది మందితో హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. గౌడన్నల ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు పాపన్నగౌడ్ స్ఫూర్తితో యువత త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ లీగల్ అడ్వైజర్ ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, అంబర్ పేట కార్పొరేటర్ విజయ్ కుమార్‌గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్య గౌడ్, మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డమీది విజయ్‌కుమార్‌గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ సదానందంగౌడ్, నేతలు ప్రభాకర్‌గౌడ్, రఘుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. గౌడన్నలకు వైన్‌షాపుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి. పెంచుతామన్న ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు అందజేయాలి. ప్రతి గ్రామానికి ఒక వైన్‌షాప్ ప్రతిపాదనను విరమించుకోవాలి. దీనిపై అబారీ శాఖ మంత్రి తక్షణం వివరణ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలి. ఆగస్టు 18న ఆయన జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై పాపన్నగౌడ్ విగ్రహానికి భూమిపూజ చేసి, విగ్రహాన్ని ఏర్పాటుచేయాలి.
– అంబాల నారాయణగౌడ్, తెలంగాణ గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షుడు