హైదరాబాద్, జనవరి 18 (నమస్తేతెలంగాణ): ‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయి. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో కుస్తీపడుతూ, రాష్ట్రంలో మాత్రం దోస్తీ కడుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో సీఎం సభా సాక్షిగా ఆ రెండు పార్టీల మెత్రీబంధం బట్టబయలైంది’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తేల్చిచెప్పారు. బీజేపీ ఎంపీ, ముఖ్యమంత్రి పరస్పరం పొగడ్తలతో మునిగితేలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బురదజల్లడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ను నేరు గా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యంలేకే రెండు పార్టీలూ మున్సిపల్ ఎన్నికల్లో జతకట్టేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధికోసం ఇందిరమ్మ చీరలు ఇచ్చిన సీఎం.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం పట్టణ మహిళలకు చీరలు ఇస్తామని ప్రకటించడం విడ్డూరమని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వలసల జిల్లాగా మిగిలిన పాలమూరుకు కేసీఆర్ పదేండ్ల పాలనలోనే మహర్దశ పట్టిందని శ్రీనివాస్‌గౌడ్ ఉద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు తాగునీటి కోసం ఈ ప్రాంత ప్రజలు అరిగోస పడాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ‘మా నాన్న చనిపోతే స్నానానికి కూడా నీళ్లు లేవని రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పింది వాస్తవంకాదా?’ అని ప్రశ్నించారు. కానీ కేసీఆర్ చొరవతో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని తెలిపారు. కేసీఆర్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నీటిగోస తీర్చారని స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో మళ్లీ పూర్వపు పరిస్థితులు దాపురిస్తున్నాయని శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. శిలాఫలకాలు వేయడం.. మరిచిపోవడం తప్ప జిల్లా ప్రజలకు ఒరగ బెట్టిందేమీ లేదని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. తాను మంచి పనులు చేస్తుంటే ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు అడ్డుపడుతున్నారని చెప్పడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి.. కాలువలు తవ్వితే అడ్డుపడ్డామా? పాలమూరు ప్రాజెక్టుకు నిధులిస్తామంటే వద్దన్నమా? కాలేజీలు కడతామంటే నిలువరించామా? అని ప్రశ్నించారు.
కానీ సీఎం సాకులు చెప్పి తప్పించుకుంటూ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లులేని జూరాలపై ప్రాజెక్టులు కడతామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో మేధావులు సైతం నోరు విప్పాలని విజ్ఞప్తి చేశారు. సమైక్య పాలనలో అష్టకష్టాలు పడ్డ పాలమూరు జిల్లా ప్రజల గోస తీర్చిన కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. తెలంగాణను సాధించిన మహానేతను ఉద్దేశించి నడుం విరిగి పడ్డాడని అడ్డగోలుగా మాట్లాడటం బాధాకరమని తెలిపారు. మంత్రుల వ్యవహార శైలితో దేశవ్యాప్తంగా మహిళా ఐఏఎస్ అధికారుల పరువు గంగలో కలుస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉమ్మడి పాలమూరుకు ద్రోహం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డే నిజమైన మారీచుడని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణను సాధించి పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి పదే పదే మహబూబ్‌నగర్‌కు రావడం మినహా ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. నల్లమల బిడ్డనని చెప్పుకుంటూ ప్రజల ముఖాలను నల్లగా చేసి వెళ్తున్నారని దుయ్యబట్టారు.
మహబూబ్‌నగర్ సభలో పచ్చి అబద్ధాలు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కటి మాత్రం నిజం చెప్పారని, గతంలో పాలించిన ముఖ్యమంత్రులు మహబూబ్‌నగర్ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని ప్రపంచబ్యాంకు రుణం తెచ్చుకున్నారనే విషయం చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రా న్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్, టీడీపీ ముఖ్యమంత్రుల వైఫల్యాలను ఆయన అంగీకరించారని చెప్పారు. అంటే తాను కొనసాగుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే పాలమూరు వెనుకబాటుకు కారణమని చెప్పకనే చెప్పారని స్పష్టంచేశారు.
పాలమూరు దశ, దిశను మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, ప్రాజెక్టులు కట్టింది.. ఊరూరా రోడ్లు వేసింది కూడా ఆయన చలువేనని లక్ష్మారెడ్డి ఉద్ఘాటించారు. మొదటి క్యాబినెట్ మీటింగ్‌లోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. కేంద్రం నిధులివ్వకున్నా రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తిచేశారని గుర్తుచేశారు. అలాగే భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తిచేసి, వందకు పైగా చెక్‌డ్యాంలు నిర్మించి, చెరువులను బాగు చేసి జిల్లాలోని ఏడు లక్షల ఎకరాలకు నీరందించారని వివరించారు.
నాడు రాష్ట్రవ్యాప్తంగా మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. కేవలం పాలమూరులోనే ఐదు వైద్య కళశాలలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్ సభలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేసీఆర్‌పై నిందారోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజంగా ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమకు చేతగాదని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.