హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ‘రైతుభరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిల్లిమొగ్గలు వేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ భరోసా అందిస్తామని చెప్పి సాగదీస్తూ ఇబ్బంది పెడుతున్నారు’ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో మూడెకరాల్లోపు ఉన్న రైతులకు రూ.3,487 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఒక ప్రకటనలో విమర్శించారు. మార్చి 31లోగా రైతులందరికీ రైతుభరోసా ఇస్తామని చెప్పి భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారని దుయ్యబట్టారు. మూడెకరాల వరకు రైతుభరోసాను కుదించే ఆలోచన చేస్తున్న సర్కారు.. ఐదెకరాల వరకు ఇస్తామని లీకులు ఇస్తున్నదని ఆరోపించారు. 1.48 కోట్ల ఎకరాలకు భరోసా ఇస్తామని ప్రకటించి, ఇప్పటివరకు 58.13 లక్షల ఎకరాలకు మాత్రమే ఇవ్వడం విడ్డూరమని పేర్కొన్నారు. పదేండ్లు ప్రగతిబాట పట్టిన వ్యవసా యం కాంగ్రెస్ పాలనలో తిరోగమిస్తున్నదని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదు.. రైతులను వేధించే పాలన అని నిప్పులు చెరిగారు. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలకు కుదించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తంచేశారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇవ్వాలని, లేకపోతే తమకు చేతకాదని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.