హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చి, విచారణకు రావాలని కోరడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరజన్రెడ్డి పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నదని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ సర్కార్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల చర్యలకు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీలేదని ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చిందని పేర్కొన్నారు.
కక్ష సాధింపు చర్యలు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఓ అభూతమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఈ కేసులో వాస్తవం లేదని చెప్తున్నా.. ప్రభుత్వం విచారణ పేరుతో వేధించడం సరికాదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని పేర్కొంటూ ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసినా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడటం హేయమని మండిపడ్డారు. కాంగ్రెస్ చౌకబారు ఆరోపణలకు బీఆర్ఎస్ భయపడేది లేదని, కోర్టులపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, పోరాటం బీఆర్ఎస్ నేతల నైజమని చెప్పారు.
ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ వ్యవహారం: వద్దిరాజు
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుకు సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పినా, హరీశ్‌రావుకు నోటీసులు జారీచేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలకుల బెదిరింపులు, అక్రమ కేసుల బనాయింపులు, వేధింపులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడబోవని స్పష్టంచేశారు.
ప్రతీకారంగానే నోటీసులు: క్రాంతికిరణ్
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చిందని, ఈ ప్రతీకారం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పేర్కొన్నారు. బొగ్గు స్కాంపై సీబీఐతో న్యాయ విచరణ జరిపించాలంటూ హరీశ్‌రావు డిమాండ్ చేసినందుకు ప్రతీకారంగానే.. ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం తెర మీదకు తెచ్చిందని విమర్శించారు. హరీశ్‌రావుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ, పోలీసులు విచారణకు పిలవడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. బొగ్గు సాంలో సీఎం, డిప్యూటీ సీఎంకీ లావాదేవీలు ఉన్నందునే కక్ష సాధింపులకు పాల్పడుతూ నోటీసులు ఇచ్చారని విమర్శించారు.
ప్రభుత్వ కుట్రలను ఎదురిద్దాం: దేవీప్రసాద్
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న హరీశ్‌రావుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు కేసును కొట్టేసిందని చెప్పారు. అయినప్పటికీ హరీశ్‌రావుకి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్‌రెడ్డి సరార్కు న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే సిట్ నోటీసులని దుయ్యబట్టారు. అక్రమ కేసులు, విచారణల పేరుతో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలనుకోవడం భ్రమ మాత్రమేనని చెప్పారు.
ఉద్యమకారులను భయపెట్టలేరు: ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలంగాణ ఉద్యమకారులను కేసులు పెట్టి భయపెట్టాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నదని, కానీ, అది సాధ్యం కాదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలోనే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో హరీశ్‌రావుకు క్లీన్‌చీట్ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు మళ్లీ అదే కేసును తవ్వడం న్యాయవ్యవస్థపై దాడిగానే భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాలనలో కక్షసాధించడం తప్ప ప్రజలకు చేసిందేమీలేదని మండిపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఫోన్‌ట్యాపింగ్ పేరుతో డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కక్ష రాజకీయాలతో రేవంత్‌రెడ్డి తన పతనాన్ని తానే రాసుకుంటున్నారని పేర్కొనారు.
చిల్లర కుట్రలు: దూదిమెట్ల బాలరాజుయాదవ్
హరీశ్‌రావు ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక.. కాంగ్రెస్ నాయకులు చిల్లర కుట్రలకు తెరలేపారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా, అక్రమ అరెస్టులు చేసినా, భౌతిక దాడులతో భయపెట్టినా.. బీఆర్ఎస్ దీటుగా ఎదుర్కొంటుదని చెప్పారు. మంత్రివర్గంలో చెలరేగిన అసమ్మతి నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా హరీశ్‌రావుపై సిట్ విచారణ డ్రామాకు సీఎం రేవంత్‌రెడ్డి మరో కుట్ర చేశారని మండిడ్డారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేధింపులు: పల్లె రవి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇవ్వడమంటే అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేధించడమేనని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ పేర్కొన్నారు. విచారణకు రావాలని హరీశ్‌రావుకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని మండిపడ్డారు. బొగ్గు కుంభకోణం, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేని తమ అసమర్థత, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా పనిచేస్తున్నారని, భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
స్కామ్‌లు బయటపెట్టినందుకే కక్ష: సతీశ్‌రెడ్డి
తమ తప్పులు బయటపడిన ప్రతిసారీ.. రేవంత్ సరార్ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నదని రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే హరీశ్‌రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచారని పేర్కొన్నారు. బొగ్గు గనుల స్కాంను హరీశ్‌రావు బయటపెట్టిన నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఎకడ తమ వసూళ్ల దందా గుట్టు రట్టవుతుందోననే భయంతోనే కొత్త డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి బుద్ధి మార్చుకోకపోతే, సమయం వచ్చినప్పుడు ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.
నోటీసులకు ఉద్యమకారులు భయపడరు: గోసుల
మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిట్ నోటీసులు జారీచేయడాన్ని బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ ఖండించారు. సిట్ నోటీసులు చూసి తెలంగాణ ఉద్యమకారులు భయపడతారని అనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అజ్ఞానానికి నిదర్శనమని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రేవంత్‌రెడ్డి సాగిస్తున్నది ప్రజాపాలన కాదని, రాజకీయ ప్రతీకార పాలని అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు స్పష్టంగా క్లీన్చిట్ ఇచ్చిన అంశాన్ని మళ్లీ తవ్వడం న్యాయవ్యవస్థపై దాడి కాదా? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పులకు గౌరవం లేదని ఈ ప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని ఆరోపించారు. రాష్ర్టాన్ని నిలబెట్టిన నాయకులను సిట్ పేరుతో వేధించడం కాంగ్రెస్ దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు. మీ వైఫల్యాలను ప్రశ్నించామని మా నోరు నొక్కుతున్నారా? అని ప్రశ్నించారు. బొగ్గు గనుల్లో చీకటి ఒప్పందాలు, ఇసుక మాఫియాకు రాజకీయ రక్షణ, లిక్కర్ పాలసీలో కొత్త దోపిడీ, ఫారెస్ట్ భూములను దోచుకునే రియల్ ఎస్టేట్ దందా.. బహిరంగ రహస్యాలు ఇవేనా అంటూ దుయ్యబట్టారు. హరీశ్‌రావును టార్గెట్ చేస్తే మీ అవినీతి దాగుతుందా? మీ వైఫల్యాలను ప్రజలు మరిచిపోతారా? మీ ప్రజావ్యతిరేక పాలన చరిత్ర చెరిగిపోతుందా అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. హరీశ్‌రావు ఒంటరి కాదని, కోట్లాది గొంతుకలు ఆయన వెనుక ఉన్నాయని, ఎన్ని కుట్రలు చేసినా, అక్రమ కేసులు పెట్టినా ఈ అబద్ధాల పాలనను అంతమొందిస్తామని హెచ్చరించారు.