వనపర్తి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపును వెనక్కి పంపించి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ మరో కొత్త నాటకం ఆడుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో పంపిన 90 టీఎంసీల నీటి కేటాయింపుపై తిరకాసు పెడుతూ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యులతో జరిగిన ప్రత్యేక సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు తన స్వగృహం నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు స్థానిక నేతలతో కలిసి మోటర్‌సైకిళ్లపై ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాలమూరు ప్రాజెక్ట్‌పై అనేక సందేహాలను కేంద్రం వెలిబుచ్చగా వాటిని నివృత్తి చేసినట్టు గుర్తుచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణకు సాగునీటి విషయంలో మోకాలడ్డుతున్నదని ధ్వజమెత్తారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి కేటాయింపులపై జరుగుతున్న అన్యాయాలను గ్రామగ్రామానా నిరసన దీక్షలతో ఎండగట్టేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సమైక్య పాలనలో తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలను సమర్థించిన నాటి అధికారిని చంద్రబాబు సలహా మేరకు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల సలహాదారుడిగా నియమించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయినా.. రేవంత్ సర్కారు రెండేండ్లుగా పాలమూరు ఎత్తిపోతలను ఏమాత్రం పట్టించుకోలేదని.. నీటి కేటాయింపులను సైతం తుంగలో తొక్కుతున్నదని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరులోని 8 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు చేరేలా ప్లాన్ చేసినట్టు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి సమాచారం అడగని కేంద్రం, కాంగ్రెస్ పాలనలో 45 టీఎంసీలకే పరిమితం చేస్తూ డీపీఆర్ పంపాలని కొర్రీ పెట్టిందని దుయ్యబట్టారు. ఇదంతా రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఆడుతున్న నాటకమని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి పరంగా అన్యాయం చేసేందుకు ఎత్తుగడలు చేస్తున్నారని.. ఈ విషయాన్ని ఎక్కడికక్కడ ఎండగడతామని హెచ్చరించారు. గ్రామాల్లో దీక్షలు చేపడుతూ.. పల్లెలు, మండలాల వారీగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అర్థంపర్థం లేకుండా అవివేకంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త సర్పంచుల పాలన గాడిలో పడే వరకు సీనియర్లు తోడ్పాటు అందించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు నాగం తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.