హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గతేడాది కంటే ఈసారి వరి సాగు తగ్గినా యూరియా కొరత ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. గతేడాది 66.78 లక్షల ఎకరాల్లో వరి వేయగా, ఈ సారి 22లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని తెలిపారు. రేవంత్‌రెడ్డి సర్కారు వైఫల్యేం వల్లే రైతులకు ఈ పరిస్థితి ఎదురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో అన్ని పంటలకూ సరఫరా..
గత సర్కారు హయాంలో ఇదే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రంలోని అన్ని రకాల పంటలకూ సక్రమంగా సరఫరా చేసినట్టు గుర్తు చేశారు. ఇప్పుడెందుకు కొరత ఏర్పడిందో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు వైఖరితో రైతులంతా దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. మరో పక్క ముందే కేటాయించిన యూరియా కోటా రాష్ట్రానికి ఇచ్చామని కేంద్రం చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి 16 మంది ఎంపీలు ఉన్నా లాభమేంటని ప్రశ్నించారు.
ఏప్రిల్ నుంచే యూరియా డ్రా చేయాలి
ఈ వానకాలానికి కేంద్రం తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని, ఏప్రిల్ నుంచి ఆగస్టు లోపు డ్రా చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు, మిగతాది సెప్టెంబర్ కోసం వాడుకుంటరని చెప్పారు. దీనికి బదులుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 5.25 లక్షల మెట్రిక్ టన్నులు (ఎంటీ)సరఫరా జరిగిందని, 3 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు సరఫరాలో లోటు ఉందని దుయ్యబట్టారు. అలాగే మార్క్‌ఫెడ్ వద్ద వాస్తవానికి 2 లక్షల ఎంటీలు బఫర్‌స్టాక్‌గా ఉండాలని, ప్రస్తుతం 23 వేల ఎంటీలు మాత్రమే ఉండడం విడ్డూరం కాదా అని ప్రశ్నించారు. యూరియా కోసం చెప్పులతో క్యూలైన్లు కట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఆయన సర్కారును నిలదీశారు. గతంలో యూరియా పక్కదారి పట్టకుండా వేప నూనెతో స్ప్రే చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లక్షల టన్నుల కొద్దీ యూరియా కొరత ఏర్పడడం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. రైతు బీమా పథకం ప్రీమియం కట్టకుండా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు.
నీటమునిగిన పంటలపై స్పందనేది?
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నీట మునిగిన పంటలపై ప్రభుత్వం స్పందించడం లేదని, రైతులకు ఎలాంటి భరోసా ఇస్తుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి 50 సార్లు వెళ్లినా, రైతులకు కావాల్సిన యూరియా మాత్రం సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మైత్రి కొనసాగుతున్నదని మండిపడ్డారు. ఐదేండ్లు ఫలితాలు ఇ చ్చిన కాళేశ్వరాన్ని సద్వినియోగం చేసుకోకుం డా, కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని కిందకు వదిలేస్తూ ఏపీ ప్రాజెక్టుల కోసం పరోక్షంగా సాయం చేస్తున్నదని దుయ్యబట్టారు. 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పుట్ట మధు, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ పాల్గొన్నారు.