సిద్దిపేట, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. మూగ జీవాలు కూడా రేవంత్‌రెడ్డిని క్షమించవు. హైడ్రా పేరుతో విధ్వంసం చేసి పేద ప్రజల జీవితాలను నాశనం చేసిండు’ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవసభ సన్నాహక సమావేశాల్లో భాగంగా సిద్దిపేట ముఖ్యనాయకులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండు, భూముల అమ్మకాల పేరుతో మూగజీవాల గోస పోసుకున్నాడు, రైతులకు సగం రుణ మాఫీ చేసి చేతులు ఎత్తేసిండని మండిపడ్డారు. 13 వేల కోట్లు రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టి, కేవలం 14 వేల కోట్లు రుణమాఫీ చేశారని వివరించారు. ప్రభుత్వం వైఫల్యంతో చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట జనగాంలో 50వేల ఎకరాల్లో పంట ఎండి పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వంఫై ఒత్తిడి తెచ్చి రంగనాయకసాగర్‌లో ఒక టీఎంసీ నీళ్లు తెప్పిస్తే సిద్దిపేట నియోజకవర్గంలో ఒక ఎకరం కూడా ఎండిపోకుండా ఉందని చెప్పారు. ప్రభుత్వం వైఫల్యాలను వరంగల్ సభలో ఎండగడుతామని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి 20 వేల మందికి పైగా పార్టీ సభకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. మరో వెయ్యిమందితో విద్యార్థులు, యువత పాదయాత్రగా తరలివెళ్తారని చెప్పారు. వంద ట్రాక్టర్లతో ర్యాలీగా సభకు బయలుదేరాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. నంగునూర్ మండలం పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి వరంగల్ సభ ఖర్చులకు తన వంతుగా రూ.25 వేలు ప్రకటించారని చెప్పారు. మందపల్లి గ్రామస్థులు కూలి పని చేసే తామే స్వచ్ఛందంగా సభకు వస్తామని తెలిపారని చెప్పారు. 27న ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు. కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పారు.
మహాసభను విజయవంతం చేద్దాం ; మాజీ మంత్రి సత్యవతి పిలుపు
మహబూబాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : 27న ఎలతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత నివాసంలో మాజీ మంత్రి రెడ్యానాయక్ అధ్యక్షతన డోర్నకల్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సత్యవతి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని అనుకోలేదన్నారు. మహిళలకు రూ.2500, పింఛన్లు రూ.4వేలు, రైతు భరోసా రూ.15వేలు, ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తామన్న మాటలు ఇప్పుడు ఎటుపోయాయని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ.. బహిరంగ సభకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. మాజీ మంత్రి రెడ్యానాయక్ మాట్లాడుతూ.. రజతోత్సవ సభకు డోర్నకల్ నియోజకవర్గం నుంచి 20వేల మంది తరలిరావాలని పిలుపునిచ్చారు.