Satyavati Rathod | కురవి, నవంబర్ 30 : ‘వంట గదులు ఇట్లనే ఉంటయా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడతారా? విద్యార్థులను కనీసం మనుషుల లెక్క చూడకపోతే ఎలా?’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్)ను శనివారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలతోపాటు డైనింగ్హాల్ను పరిశీలించారు. ఎటు చూసినా చెట్ల పొదలు కనిపించడంతో ప్రిన్సిపాల్ ప్రదీప్కర్థంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థినులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్‌తో కలిసి టిఫిన్ చేశారు. సమస్యలపై విద్యార్థినులతో మాట్లాడారు.
డైనింగ్ హాలులో రెండు రోజులుగా వ్యర్థ పదార్థాలు ఉంచడం, అందులో నుంచి దుర్వాసన రావడంపై సిబ్బందిపై మండిపడ్డారు. మురుగు నీరు నిల్వ ఉన్నా పట్టించుకోకుండా ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారని, ఇలాంటి వాతావరణంలో పిల్లలు భోజనం చేస్తే వారి ఆరోగ్యం బాగుంటుందా? అంటూ ప్రశ్నించారు. గురుకులంలో నెలకొన్న సమస్యలపై పెదవి విరిచిన ఆమె వెంటనే ఆర్సీవోకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌తో మాట్లాడారు. వసతులు సరిగా లేకపోవడంతో 500 మందికిపైగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రం మొత్తం ఫుడ్ పాయిజన్‌తో అల్లాడుతుందని, పట్టించుకోకపోతే అన్ని గురుకులాలు అలాగే తయారవుతాయని చెప్పారు. ‘మేమున్నాం.. అధైర్య పడొద్దు’ అంటూ విద్యార్థినులకు ఆమె భరోసానిచ్చారు.
చిన్న పిల్లలు పిట్టల్లా రాలుతున్నా పట్టదా?
గురుకులాల్లో చదువుకుంటున్న చిన్న పిల్లలు పిట్టల్లా రాలుతుంటే మహిళా మంత్రులు ఇష్టం వచ్చినట్టుగా రోజుకోమాట మాట్లాడటంపై సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. మాడల్‌ను సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాం గ్రెస్ హయాంలో గురుకులాలు పర్యవేక్షణ లేక పడావుపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఫుడ్ పాయిజన్‌లో గురుకులాల సెక్రటరీగా గతంలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రమేయం ఉన్నదని మంత్రి కొండా సురేఖ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేయకుండా ఇకనైనా బుద్ధితెచ్చుకొని మంచిగా పని చేయాలని హితవు పలికారు. విద్యార్థుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.