కురవి/సీరోలు, ఆగస్టు 1 : త్వరలో ఉపఎన్నికలు ఖాయమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మన్నెగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని చెప్పారు. రానున్న మూడు నెలల్లో పది నియోజకవర్గాల్లో జరిగే ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ, భద్రాచలం ఎమ్మెల్యే లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కేంద్రానికి విన్నవిస్తుంటే.. ఇక్కడి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన ఎమ్మెల్యేలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు.