మహబూబాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాకు మంత్రి సీతక్క చేసిన అభివృద్ధి ఏమిటి? అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. బుధవారం మహబూబాబాద్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతకతోపాటు సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి హడావుడిగా వచ్చి పాత పనులకు శంకుస్థాపనలు చేసి తామేదో అభివృద్ధి చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి, ఒక్కరినైనా చేశారా.. అని ప్రశ్నించారు.
మానుకోట జిల్లా ను అభివృద్ధి చేయడం చేతగాక బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లాను ఏర్పాటు చేసి, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్, కలెక్టరేట్, మెడికల్ కళాశాల, గిరిజన వర్సిటీకి 35 ఎకరాలకు సేకరణ, ములుగు మున్సిపాలిటీకి ప్రతిపాదన, ఆదివాసీ గూడేలకు రోడ్లు, రామప్పకు ప్రపంచస్థాయి గుర్తింపు, సమ్మక-సారలమ్మ జాతరను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమనే విషయం మరచిపోవద్దని హితవుపలికారు. సీతక సానుభూతి కోసం సోషల్ మీడియాలో మూటలు మోస్తూ, వాగులు దాటుతూ చేసే నాటకాలు ములుగు ప్రజలకు తెలుసని చెప్పారు. సీతక పనితీరు బాగాలేదని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మందలించారని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు చేయడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పది ఎకరాలు పారలేదని ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఇకడ ఒక పంట పండితేనే మహా గొప్ప.. అలాంటిది కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దకుతుందని గుర్తుచేశారు. భూభారతి ద్వారా ఒక సమస్య అయినా పరిషారమైందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. బీఆర్ఎస్ హయాంలో రూ. 22 వేల కోట్ల రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఉరికించి కొడుతారని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోతు బిందు, మానుకోట మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.