బడంగ్‌పేట, నవంబర్ 4 : ఫోర్త్‌సిటీ పేరిట జరుగుతున్న భూ బాగోతాన్ని బయట పెడుతున్నందుకే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అగ్రిమెంట్లు చేసుకోవడం.. భూములు గుంజుకోవడమే నడుస్తున్నదని, ఫోర్త్‌సిటీ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. నిజాలు రాసిన ‘నమస్తే తెలంగాణ’ను, సంబంధిత జర్నలిస్టులను బెదిరించడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇదేం సంస్కృతి అని, ప్రజా పాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. పత్రిక స్వేచ్ఛను హరించడమే ప్రజాపాలనా? అని నిలదీశారు. తెలంగాణలో ఏ మూలన చూసినా భూదందా యథేచ్ఛగా సాగుతున్నదని, ఫోర్త్‌సిటీ పేరిట మాయలో దించుతున్నారని మండిపడ్డారు. అసలు ఫోర్త్‌సిటీ ఎప్పుడు వస్తుందో స్పష్టతే లేదని చెప్పారు.
నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 92లో ఉన్న 290 ఎకరాల భూమిపై రైతులకు ప్రభుత్వం ద్వారానే న్యాయం జరగాలని, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఎలా అగ్రిమెంట్లు చేసుకుంటారని ప్రశ్నించారు. ఒకవేళ రైతుల నుంచి అసైన్డ్ భూమిని తీసుకోవాలంటే ప్రభుత్వం రైతులకు న్యాయం చేసి తీసుకోవాలని, మధ్యవర్తుల బెడద లేకుండా ప్రభుత్వం నేరుగా రైతులతో మాట్లాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు . ఈ విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రైతులను మోసం చేస్తున్న వ్యక్తులు ఎంతటివారైనా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలేసి నిజాలు వెలికి తీస్తున్న ‘నమస్తే తెలంగాణ’పై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించాలని ప్రభుత్వం చూస్తున్నదని, ఇది మంచి పద్ధతి కాదని హితవుపలికారు. వార్తల సేకరణ చేయకుండా భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రతికలపై ఆంక్షలు, జర్నలిస్టులను బెదిరించే పద్ధతి మానుకోవాలని హితవుపలికారు.