బడంగ్‌పేట, డిసెంబర్ 23: మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు ఆర్అండ్బీ రోడ్డును సోమవారం పరిశీలించేందుకు వెళ్లిన మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డితో రైతులు తమ కష్టాలు ఏకరవు పెట్టారు. పథకాల విషయంలో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇస్తానన్న తులం బంగారం ఊసు లేదని, మహిళలకు రూ. 2,500 లేదని, తమకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని చెప్పుకొచ్చారు. నోరెత్తితే కేసులు పెడుతున్నారని, రెండు పంటల పైసలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని రకాలుగా మంచిగ చేసిండని, ఇప్పుడు ఒక్క పని కూడా అయితలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలు విన్న సబిత రైతులను ఓదార్చారు. అందరికీ రుణమాఫీ చేశామని అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చెప్పారని, కానీ రైతులేమో ఇప్పటికీ తమకు మాఫీ కాలేదని చెప్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు ఇవ్వనోళ్లు, తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలోనే తుమ్మలూరు రోడ్డు
తుమ్మలూరు రోడ్డును పరిశీలించిన సబిత అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే తుమ్మలూరు గేటు నుంచి మహేశ్వరం వరకు రోడ్డును రూ. 14 కోట్లతో మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. ఎన్నికలకు ముందే రోడ్డు పనులు ప్రారంభించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నిలిపివేసిందని విమర్శించారు. రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో తుమ్మలూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇంకా 70 శాతం పనులు జరగాల్సి ఉందని తెలిపారు. త్వరగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ఎత్తు పెరగడంతో మొహబ్బత్‌నగర్ వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు సబితకు తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.