హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే భయమని, అందుకే రేవంత్ తన పుట్టిన రోజున కూడా కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉండలేకపోయారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మహిళలు, చిన్నపిల్లలు టీవీలు బంద్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.
తెలంగాణ ప్రదాత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. అత్యున్నత పదవిలో ఉండి ఇలా మాట్లాడి సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తారు. ఎలాంటి విలువలు నేర్పుతారు. కనీసం పుట్టిన రోజున కూడా కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉండలేకపోయారంటే.. ఆయనంటే మీకు ఎంత గుబులు ఉందో అర్థమవుతుంది. మీ వ్యాఖ్యలను యావత్ ప్రపంచం ఖండిస్తున్నది. ఒకరి చావును కోరుకోవడం ఎంత వరకు సమంజసం?’ అని ప్రశ్నించారు.