హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో ఐదు రోజులు ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారని మాజీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోమవా రం ఢిల్లీలో ఆయన మీడియాతో మా ట్లాడారు. వరంగల్ పర్యటన సందర్భంగా రేవంత్‌రెడ్డి జిల్లాకు ఏం చేశారని నిప్పులు చెరిగారు. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్‌లోని ఎంజీఎం దవాఖాన మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. దవాఖాన నిర్మాణ అంచనాలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించిన సీఎం రేవంత్‌రెడ్డి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 4300 కోట్లు ఎందుకు పెరిగాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డిలో భాగమైన ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిందిపోయి కొడంగల్ చుట్టుపక్కల నియోజకవర్గాలకు వెళ్లాల్సిన నీటిని తన నియోజకవర్గానికి దోచుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. ఇందుకే ఆ ప్రాజెక్టు అంచనాలు పెరిగాయని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాలను, తన నియోజకవర్గ ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి భ్రమింపజేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ బిడ్డనని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి ఐదేండ్లు ఎంపీగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని, క్యాంపెన్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న సమయంలోనే కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని పొన్నాల గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే తన పాత చరిత్రను మరచిపోవద్దని, ఆరోపణలు, దూషణలు మాని పరిపాలనపై దృష్టిసారించాలని సూచించారు.