హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ‘పాలమూరు ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, వాటిని రికార్డు స్థాయిలో పూర్తిచేసి, 10 లక్షల ఎకరాలకు నీరందించి, నాటి వలస బతుకుల వ్యథను తీర్చి ఈ జిల్లా ముఖచిత్రాన్నే మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది’ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. కానీ రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మళ్లీ వలసలనే బహుమతిగా ఇస్తున్నారని దెప్పిపొడిచారు. అసలు రేవంత్‌రెడ్డి తెలంగాణ తడిలేని మనిషి అని అభివర్ణించారు. కేసీఆర్ నిర్మించిన నార్లాపూర్ పంప్‌హౌస్‌లోని మోటర్లను ప్రారంభించి అది తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, గౌతంప్రసాద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కేఎల్ఐ నిర్మాణానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రూ.2,600 కోట్లు ఖర్చుచేసి పారించింది కేవలం 12 వేల ఎకరాలేనని, కేసీఆర్ హయాంలో 3 వేల కోట్ల ఖర్చుచేసి 4లక్షల ఎకరాలకు నీరందించారని వివరించారు. ఉమ్మడి పాలకుల పాపానికి పాలమూరు ప్రజలు రెండు తరాల జీవితాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. బూర్గుల హయాంలో 174 టీఎంసీలతో తలపెట్టిన ప్రాజెక్టులను నీలం సంజీవరెడ్డి పాలనలో రద్దు చేశారని ఆరోపించారు. కానీ, కేసీఆర్ వచ్చిన తర్వా త శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేసి, భూసేకరణకు ఎదురైన అడ్డంకులను అధిగమించి 27 వేల ఎకరాలు సేకరించి 90 శాతం మేర ప్రాజెక్టు పనులను పూర్తిచేశారని వివరించారు.
రెండున్నరేండ్ల తన పాలనలో 74సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. పాలమూరుపై కన్నెత్తి చూడనే లేదని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. తాము అనేకసార్లు నిలదీస్తే మొక్కుబడి పర్యటన చేశారని విమర్శించారు. కానీ పాలమూరు ప్రాజెక్టుల పూర్తిపై స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. భూసేకరణ పూర్తయినా, రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిసినా.. నీళ్లు ఎలా నింపాలని సీఎం బుకాయించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రైతులు, ప్రజలకు తెలియదనే భ్రమలో పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. ఇది అహంకారమా? అపరిపపక్వతనా? బాధ్యతారాహిత్యమా? అజ్ఞానమా? అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలోనే 68 టీఎంసీల సామర్థ్యం కలిగిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన ఉద్ధండాపూర్ రిజర్వాయర్లను నిర్మించామని, 120 కిలోమీటర్ల టన్నెళ్లు, 63 కిలోమీటర్ల ఓపెన్ కెనాళ్లు పూర్తిచేసి, 145 మెగావాట్ల కెపాసిటీ కలిగిన 34 పంపులను బిగించామని గుర్తుచేశారు. వీటిని చూసి అంతర్జాతీయ జల నిపుణులు సైతం ప్రశంసలు కురిపించిన విషయాన్ని ప్రస్తావించారు.