వనపర్తి టౌన్, మే 11 : ‘కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోస పడ్తున్నారు.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకునేందుకు నానా పాట్లు పడ్తున్నారు.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే తేమ పేరుతో మిల్లర్లు, అధికారులు నిలువునా దోచుకుంటున్నారు.. రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదు’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. వనపర్తి జిల్లాలోని తాళ్ల చెరువు, చిమనగుంటపల్లి, గోపాల్పేట, వనపర్తి మార్కెట్లోని కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. అక్కడి రైతుల కష్టాలను విని చలించిపోయి మార్కెట్ యార్డులో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామన్న మంత్రులు, అధికారుల మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రైతు భరోసా ఇవ్వకపోయినా, కరెంట్ కోతలు పెడ్తున్నా, సాగునీరు ఇవ్వకున్నా.. అష్టకష్టాలు పడి పండించిన వరి, మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు. పంటను అమ్ముకునేందుకు రైతులు నానా పాట్లు పడ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రవాణా, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత తీర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. క్వింటాకు 10 కిలోలు తరుగు తీస్తూ రైతులను జలగల్లా దోచుకుంటున్నాని మండిపడ్డారు.