జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా ఈ ప్రభుత్వానికి సోయిలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) విమర్శించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఎండిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. యాసంగిలో రాష్ట్రంతోపాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో పంటలు ఎండుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని నిరంజన్ రెడ్డి అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీ దొడ్డి మండల పరిధిలో నీళ్లు లేక ఎండిన వరి చేను
ప్రభుత్వం IAB సమావేశం నిర్వహించకుండా యాసంగి పంటల ప్రణాళిక రూపొందించిందని మాజీ మంత్రి చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇక్కడి రైతుల పొలాలకు నీరు ఇచ్చి పంటలను కాపాడలేక పోయారని వాపోయారు. ముఖ్యమంత్రి తన సీటును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే నీటిపారుదల మంత్రి రైతుల బాగోగులు పట్టించుకోకుండా ఆ సీటుపై కన్నేశాడని అన్నారు. పాలమూరు జిల్లా మంత్రికి కక్షలు కార్పణ్యాలపై ఉన్న శ్రద్ధ రైతుల పంటలను కాపాడడంలో లేదని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని, అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఓవైపు పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని పరామర్శించడానికి కూడా ఈ నాయకులకు తీరిక లేదని విమర్శించారు. పదేళ్లలో ఎప్పుడు కూడా రైతుల పంటలు ఎండకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంటలు ఎండడానికి కారణమయ్యాడని ఆరోపించారు.
కేటీ దొడ్డి మండలం కొండాపురం గ్రామ పరిధిలో ఎండిన పంటలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ప్రస్తుతం రైతులకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని మాజీ మంత్రి ప్రశ్నించారు. వరంగల్ డిక్లేషన్లో రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసాను మూడు ఎకరాలతోనే బందు చేసిందని అన్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి ఒట్లు వేసి అటు దేవుళ్లను, ఇటు రైతులను నిండా మోసం చేశాడని ఆరోపించారు. ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రేలంపాడు రిజర్వాయర్‌లో నాలుగు టీఎంసీల నీటిని నిలువ చేసుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ యాసంగిలో రైతులు ప్రభుత్వం, అధికారుల మాటలు విని పంటలు సాగు చేస్తే.. ఆ పంటలకు ప్రస్తుతం నీరులేక ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్డీఎస్ పరిధిలో గత 50 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితి కనిపించ లేదని మాజీ మంత్రి అన్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ కింద 47,000 ఎకరాలలో రైతులు వివిధ పంటలు సాగుచేశారని, ప్రస్తుతం పది రోజులుగా నీరు నిలిచిపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతుల పంటలు కాపాడాలని మాజీ మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు బాస్ హనుమంతు నాయుడు, అంగడి బసవరాజు, పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీరాములు, మోనేష్ కుమార్, కురువ పల్లయ్య తదితరులు ఉన్నారు.