Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న చేస్తామని చెప్పి.. పద్రాగస్టుకు వాయిదా వేసి ఇప్పటికీ పూర్తి స్థాయిలో చేయలేదని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింత ప్రభాకర్, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులందరికీ రుణమాఫీ అయిందని రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా నిరూపించాలని, తాను ఎక్కడికైనా, ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులనే కాదు దేవుళ్లను మోసం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిది విమర్శించారు. తనకు రాజీనామాలు కొత్త కాదని, రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి, ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర తనదని, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి పారిపోయిన చరిత్ర రేవంత్‌ది అని విమర్శలు చేశారు.
25 లక్షల మందికి ఎగనామం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు కానుకగా రూ. 40 వేల కోట్లు ఏకకాలంలో చేస్తానని చెప్పాడని, పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టుకు 31వేల కోట్లు చేస్తానని, బడ్జెట్లో 26 వేల కోట్లు మాత్రమే పెట్టారని హరీశ్‌రావు చెప్పారు. అసెంబ్లీలో రుణమాఫీ, రైతు భరోసా మీద చర్చ పెట్టాలని పట్టుపట్టినా ముఖం చాటేసి పారిపోయిండని విమర్శించారు. పంద్రాగస్టుకు రుణమాఫీ అయిపోయిందని ప్రకటిస్తే.. లెకలు చూస్తే కేవలం 17 వేల కోట్లు మాత్రమే తేలిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతుల సంఖ్య 47 లక్షలు అని చెప్పి 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేశారని, సుమారు 25 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టినట్టు రికార్డులే చెబుతున్నాయని మండిపడ్డారు.
మాట తప్పెటోడిని కాదు
రుణమాఫీ చేసిన, రాజీనామా అని రంకెలేస్తున్న రేవంత్‌రెడ్డి.. ఆగస్టు15లోపు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలను సంపూర్ణంగా నెరవేరిస్తే తాను రాజీనామాకు సిద్ధమని ఆనాడు ప్రకటించానని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఒకవైపు రైతుబంధు రాక, మరోవైపు రుణమాఫీ చెయ్యక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాల్సిందిపోయి, తన రాజీనామా అడగడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతుకు మోసం.. దైవానికి ద్రోహం
రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేసి.. హిందు, ముస్లిం, క్రిస్టియన్లు నమ్ముకున్న దేవుళ్లకు కూడా ద్రోహానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. రేవంత్ పాపం ప్రజలకు శాపం కావద్దని, తాను తీర్థయాత్రకు బయలుదేరుతానని ప్రకటించారు. రుణమాఫీ చేసే దాకా, రైతు భరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టేది లేదని హరీశ్‌రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ పక్షాన మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు.
ప్లేసు.. డేటు.. డిసైడ్ చెయ్
‘నువ్వు నిజంగనే రైతు రుణమాఫీ అయ్యిందనుకుంటున్నవా రేవంత్‌రెడ్డి.. రైతులందరికీ రుణమాఫీ అయ్యిందని దమ్ముంటే నిరూపించు. ప్లేసు, డేటు, టైము నువ్వే చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ నియోజకవర్గానికి పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం. నీ నియోజకవర్గమా ? , నా నియోజకవర్గమా ? ఎకడికైనా పోదాం, నేనంటున్నది కరెక్టో, నువ్వంటున్నది కరెక్టో ఖుల్లం ఖుల్లా తెలుస్తది’
– రుణమాఫీపై హరీశ్‌రావు సవాల్