Harish Rao | నిరుడు సింగరేణి లాభం రూ.6394 కోట్లయితే.. చూపింది రూ.2,360 కోట్లు మాత్రమే. మిగతా నగదు ఏమైంది? కార్మి కుల బోనస్‌లో కోతపెట్టి సంస్థ డబ్బును రేవంత్.. మెస్సీ ఫుట్‌బాల్ సోకులకు తగలేశారు. లాభాల్లోనూ కాంగ్రెస్ నేతలు కక్కుర్తి పడ్డారు
-హరీశ్
నిన్నటి భట్టి విక్రమార ప్రెస్‌మీట్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెతను తలపించింది. సామ్‌ను సమర్థించుకునేందుకు సంబంధం లేని కాగితాలతో మసిపూసి మారేడుకాయ చేశారు. సైనిక్ సూల్లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం పెట్టిన నిబంధనను తెచ్చి.. వేల కోట్ల సింగరేణి ఓబీ కాంట్రాక్టులకు ముడిపెట్టడం హాస్యాస్పదం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే. జనవరిలో సైట్ విజిట్ నిబం ధన లేకుండా 7శాతం తకువకు టెండర్లు ఖరారైతే.. మే నెలలో ఆ నిబంధన పెట్టి అంచనా రేట్ల కంటే ఎకువకు ఎందుకు కట్టబెట్టారు?
– హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ): సింగరేణి సామ్ సూత్రధారి రేవంత్‌రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బావమరిది సృజన్‌రెడ్డి అని.. సాక్షాత్తు దొంగే రేవంత్‌రెడ్డి అయినప్పుడు ఆయనతో మాట్లాడితే న్యాయం జరుగుతుందా? అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. ‘నాకు లేఖ రాయండి, నేను రేవంత్‌రెడ్డితో మాట్లాడతా’ అని భట్టి అనడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సామ్‌కు ఎవరు బాధ్యులు? ఎంత నష్టం జరిగింది? లబ్ధిపొందిన వారెవరు? ఈ మూడు కీలక ప్రశ్నల్లో ఒకదానికైనా భట్టి సమాధానం చెప్పకుండా దాటవేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ కండ్లలో ఆనందం కోసం కాకుండా సింగరేణి కార్మికుల కండ్లలో ఆనందం కోసం, సంక్షేమం కోసం భట్టి పనిచేయాలని ఆయన హితవు పలికారు. తాము బయటపెట్టిన సోలార్ సామ్, పేలుడు పదార్థాల సామ్, ఉద్యోగుల డీ-ప్రొమోషన్ వంటి కీలక అంశాలపై ఎందుకు ఆయన ఒకమాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు.
2025 నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరెవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి, రాజ్యసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో అర్ధసత్యాలు వల్లించారని, అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయో ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి, ఆయన బామ్మర్దిని కాపాడేందుకే సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి విక్రమార అబద్ధాలను వండి వార్చారని విమర్శించారు. సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి అని స్పష్టంచేశారు.
సీఎం, సృజన్‌ను కాపాడేందుకే..
సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బామ్మర్ది సృజన్‌రెడ్డి బాగోతం బయటపడకుండా కాపాడే ప్రయత్నం భట్టి గట్టిగా చేశారని హరీశ్‌రావు విమర్శించారు. తన 40 ఏండ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రిని బొగ్గు సాండల్ నుంచి బయటపడేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు. తమ అనుయాయులకు టెండర్లు దకేలా విధానాలు మార్చారని మండిపడ్డారు. 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉంటే.. ఎలాంటి పనుల కోసం సిఫార్సు చేశారో ఎందుకు చెప్పలేదని భట్టిని నిలదీశారు. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐ) సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికెట్‌ను ప్రతిపాదిస్తే.. ఆ సిఫార్సు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల కోసమా? కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్‌ల కోసమా? స్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ల కోసమా? లేదా నిజంగానే ఓవర్ బర్డెన్(ఓబీ) రిమూవల్ పనుల కోసమా? అని ప్రశ్నించారు.
సైనిక్ స్కూల్ వాళ్లు కూడా సైట్ విజిట్ పెట్టారని మోకాలికి బోడిగుండుకు భట్టి లింకు కలిపారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. భట్టి చూపించిన డాక్యుమెంట్లలో ఎకడ కూడా ఓబీ రిమూవల్ కాంట్రాక్టుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదని స్పష్టంచేశారు. గతంలో ఓబీ వర్స్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేనేలేదని కుండబద్దలు కొట్టారు.
2018 నుంచి ఎందుకు లేదు
నిజంగా సీఎంపీడీఐ సిఫార్సు ఓబీ పనులకే అయితే, 2018 నుంచి 2024 వరకు సింగరేణి పిలిచిన వందలాది ఓబీ టెండర్లలో ఈ షరతు ఒకసారి కూడా ఎందుకు లేదు? అని హరీశ్‌రావు భట్టిని ప్రశ్నించారు. 2018 నుంచి 2024 వరకు ప్రతి ఓబీ టెండర్లో ఈ షరతు లేదు. మరి ఇప్పుడు 2025- 26లో మాత్రమే, అదీ కొన్ని ఎంపిక చేసిన టెండర్లకే ఈ షరతు ఎందుకు అకస్మాత్తుగా తీసుకొచ్చారు? అని నిలదీశారు. ఓబీ విషయంలో సైట్ విజిట్ విధానం తెచ్చిందే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనే నిజాన్ని ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. 2025 జనవరిలో భూపాలపల్లి టెండర్‌కు సైట్ విజిట్ షరతు లేకుండానే రివర్స్ ఆక్షన్ ద్వారా అంచనా రేట్ల కంటే 7శాతం తకువకు పనులు అప్పగించారని, అప్పుడు సైట్ విజిట్ అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత మూడు నెలల్లోనే 2025 మేలో వీకే ఓసీ టెండర్‌కు మాత్రం సైట్ విజిట్ సర్టిఫికెట్ షరతు పెట్టారని గుర్తుచేశారు. అంచనా రేట్ల కంటే ఎకువ రేట్లకు లబ్ధిదారుడు సృజన్‌రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్స్కు కాంట్రాక్టు పనిదకిందని విమర్శించారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
మే 2025 తర్వాత పిలిచిన టెండర్లలో చాలా మంది కాంట్రాక్టర్లు సైట్ విజిట్ చేశారని, వారికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదని హరీశ్‌రావు కొన్ని వివరాలను బయటపెట్టారు. కొందరు కాంట్రాక్టర్లు లేఖలు ఇచ్చారని, అధికారిక ఈ-మెయిల్స్ పంపారని, ఫొటోలు కూడా జతచేశారని అయినా వారికి సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పారు. టెండర్ చివరి గంట వరకు కాంట్రాక్టర్లను వేచిచూసేలా చేసి, కేవలం 2-3 సంస్థలకు మాత్రమే పాత తేదీలతో బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్లు జారీ చేసేవారని చెప్పారు. సైట్ విజిట్ చేసిన వెంట నే స్థానిక జీఎం సర్టిఫికెట్ ఇవ్వాలని టెండర్ డాక్యుమెంట్లో ఉన్నా కాంట్రాక్టర్లు విజిట్ చే సినప్పటికీ ఎందుకు సర్టిఫికెట్లు ఇవ్వలేదని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. మే 2025 నుంచి ఇప్పటివరకు కాంట్రాక్టర్లు సందర్శించిన సైట్లు, వచ్చిన ఈ మెయిల్స్, లేఖలెన్ని? జారీ చేసిన సర్టిఫికెట్లు ఎన్ని.. కారణం చెప్పకుండా తిరస్కరించిన వివరాలన్నింటిపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్కారు బయట పెట్టకపోతే తామే ఆ మెయిల్స్‌ను బయటపెడతామని హెచ్చరించారు.
అప్పుడు లేనిది.. ఇప్పుడెందుకొచ్చింది..
గతంలో నైనీ టెండర్లు రెండు సార్లు జారీ అయ్యాయని.. 2021, 2022లో రెండుసార్లు టెండర్లు పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికెట్ షరతే లేదని హరీశ్‌రావు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అకస్మాత్తుగా ఎందుకు అవసరమైంది? అని నిలదీశారు. టెండర్ షరతులు మారిస్తే కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టి.. వారి అభిప్రాయాలు తీసుకోవాలని కానీ నైనీ టెండర్లల్లో అలాంటిదేం జరగలేదని ఆరోపించారు. ఈ స్కామ్‌లో కింగ్‌పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టాడు? ముఖ్యమంత్రి బంధువు కూడా ఆ హోటల్లో కూర్చున్న ఫొటోలు తమ వద్ద ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు వాటిని కూడా బయట పెడతామని చెప్పారు.
ఉత్పత్తి పడిపోయింది
కాంగ్రెస్ సర్కారు అవినీతి వల్ల సింగరేణిలో అనుభవం గల కాంట్రాక్టర్లు పారిపోతున్నారని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. డీజిల్‌ను కాంట్రాక్టర్ల పరిధిలోకి తెచ్చి ఆ తర్వాత టర్నోవర్ అర్హత పెంచి, 20 ఏళ్ల అనుభవం ఉన్న స్థానిక కాంట్రాక్టర్లను పకన పెట్టారని ఆరోపించారు. డీజిల్ కాంట్రాక్టర్ల పరిధిలోనే ఉంటే, ఇప్పటికే ఉన్న కాంట్రాక్టర్లు స్వయంగా డీజిల్ కొనుగోలు చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. స్వార్థం కోసం మైనింగ్ అనుభవం లేని కొత్త కాంట్రాక్టర్లకు దారులు తెరిచారని మండిపడ్డారు. దీంతో రోజురోజుకూ బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతున్నదని చెప్పారు.
స్కామ్‌లపై కేంద్రం మౌనమెందుకు?
సింగరేణిని కాంగ్రెస్ సర్కారు స్కామ్‌లకు అడ్డాగా మార్చుకున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సంస్థలో 49శాతం వాటా కలిగిన కేం ద్రం మౌనం వహించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాలా తీయించి ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు చే స్తున్నాయని విమర్శించారు.
సిరుల సింగరేణిని కాపాడుకుంటం
సైట్ విజిట్ నిబంధనతో రెండేండ్లలో సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ పెద్దలు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ పాలనలో మైనస్‌కు టెండర్లు ఖరారు చేస్తే, రేవంత్ సర్కారు మాత్రం ఫ్లస్ 7 నుంచి 20 వరకు తన అనుయాయులు, కుటుంబీకులకు కట్టబెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి భట్టికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వేలాది కార్మికులతో సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడలేదని నమ్మకముంటే మొత్తం బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదంటే సీబీఐ విచారణ కోరాలని తేల్చిచెప్పారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాపాడే వరకు బీఆర్ఎస్ విశ్రమించబోదని ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణకు కొంగుబంగారమైన సిరుల సింగరేణిని కాపాడుకుంటామని స్పష్టంచేశారు.
డిపెండెంట్ పునరుద్ధరణ ఘనత బీఆర్ఎస్దే
సింగరేణిలో చంద్రబాబు హయాంలో నిలిపివేసిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని హరీశ్‌రావు చెప్పారు. పదేండ్ల పాలనలో 19,500 మంది కార్మికుల పిల్లలకు కొలువులు ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడున్న 42,000 మందిలో సగం మంది వారసత్వ ఉద్యోగులేనని స్పష్టంచేశారు. నాడు కేసీఆర్ నెలకు ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహిస్తే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండేసార్లు బోర్డు పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఫస్ట్ బోర్డులో 55మంది వస్తే కేవలం ఐదుగురిని, సెకండ్ బోర్డులో 123మంది కార్మికులకు గాను 23మందినే అన్‌ఫిట్ చేశారని చెప్పారు. ఇలా కొర్రీలు పెట్టి వారసత్వ ఉద్యోగాలను నిర్వీ ర్యం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు కార్మికులు, వారి కుటుంబాలకు యశోద, కిమ్స్ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యమందేదని కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత కార్పొరేట్ చికిత్సను బంద్‌పెట్టి నిమ్స్, ఉస్మానియా దవాఖానలకు పంపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కార్మికులకు ఫ్లాట్ల్ ఇచ్చి ఓనర్లను చేశారని, రేవంత్ సర్కారు ఒక్కరికైనా ఫ్లాట్ ఇచ్చిందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
భట్టి విక్రమార్క.. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నైనీ కోల్ బ్లాక్ టెండర్లనే కాదు.. రెండేండ్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానంలో ఖరారు చేసిన ఓబీ వర్క్స్, సోలార్ పవర్‌ప్లాంట్ టెండర్లన్నింటీని రద్దు చేయాలి. గనులను సందర్శించిన కంపెనీల ఈ-మెయిల్స్, ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎన్సీసీ, జీఆర్ఎన్ కంపెనీ, మహాలక్ష్మి కంపెనీ ఇలా ఎన్నో కంపెనీలు తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని మెయిల్ చేశాయి. ఆ మెయిల్స్ బయటపెట్టాలి. టెండర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్స్ మినిట్స్ బయటపెట్టాలి. బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలి. లేకపోతే కార్మికులతో సింగరేణి భవన్‌ను ముట్టడిస్తాం.
– హరీశ్‌రావు
సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేదే లోపభూయిష్టమైనది. ఈ విధానంలో మొట్టమొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది సృజన్రెడ్డే. 2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లకు ఏ టెండర్ వచ్చినా, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలన్నా సృజన్రెడ్డియే రింగ్‌మాస్టర్. అన్ని ఓబీ వర్స్‌కు సైట్ విజిట్ నిబంధన పెట్టి, రింగ్ చేయడం, 7- 10శాతానికి టెండర్ వేయడం. మొత్తంగా వచ్చిన 10శాతం కమిషన్లు తీసుకోవడం. నైనీ టెండర్లే కాదు, సైట్ విజిట్ సర్టిఫికెట్తో ఖరారైన అన్ని టెండర్లను రద్దుచేయాలి.
– హరీశ్‌రావు