హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ రౌడీయిజంతో పాలించాలని చూస్తున్నదని మాజీ మంత్రి మహబూబ్ అలీ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని విధంగా గంగా జమునా తహెజీబ్గా తెలంగాణను తీర్చిదిద్దారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాతావరణాన్ని చెడగొట్టాలని కంకణం కట్టుకున్నదని విమర్శించారు. తమ హయాంలో ఎకడా కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడలేదని గుర్తుచేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్‌తో కలిసి మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బృందంపై దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరద సహాయక చర్యల్లో పాల్గొంటే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.
ప్రజలు వరదల్లో ఉంటే సీఎం రేవంత్‌రెడ్డికి సినిమా చూసే తీరిక దొరికిందా? అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవాచేశారు. సహాయక చర్యలు ఏపీలో ఒకలా తెలంగాణలో మరోలా ఉన్నాయని, తెలంగాణలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం వరద బాధితులకు సహాయం చేద్దామని వెళ్తే కాంగ్రెస్ గూండాలు రాళ్లతో దాడికి తెగబడ్డారని, ఈ పరిణామాలను చూస్తుంటే రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సిద్దిపేటలో హరీశ్‌రావు కార్యాలయంపై ఉద్దేశపూర్వకంగా దాడిచేశారని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాళ్లు దాడులకు భయపడరనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవుపలిరు. దాడులతో బీఆర్ఎస్ను కంట్రోల్ చేయాలనుకుంటే పొరపాటేనని చెప్పారు. దాడులు బీఆర్ఎస్ సంస్కృతి కాదని, రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే కేసీఆర్ ప్రభుత్వం బందోబస్తు కల్పించిందని, సీఎల్పీ లీడర్‌గా భట్టి విక్రమార పాదయాత్ర చేస్తే ఎక్కడా ఆటంకాలు కలిగించలేదని ఉదహరించారు.
రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బృందం వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల పర్యటనలో ప్రజల స్పందన చూసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డికి వణుకు పుట్టిందని ఎద్దేవాచేశారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ గూండాలు దాడులకు దిగారంటే రాష్ట్రంలో పాలన ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నదని ధ్వజమెత్తారు. గత ఆదివారం భారీ వర్షాలతో రాష్ట్రం ఆగమైపోతుంటే తన కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్లిన సీఎంకు రాష్ట్ర ప్రజలపై ఏ మేరకు ప్రేమ ఉన్నదో తెలిసిపోతున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయికి వెళ్తే రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నారని, తెలంగాణను బీహార్‌లా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. ఖమ్మం పర్యటనను సీఎం ఎన్నికల ప్రచారంలా వాడుకున్నారని విమర్శించారు.
వర్షాలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రజలను ఆదుకోవటంలో సీఎం దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రధాన ప్రతిపక్షంగా వెళ్లిన వారిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నీచ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలను లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నట్టు జరుగుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయని ఆరోపించారు. తమ కళ్లెదుటే దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రుల విలాసాలకు, పుట్టిన రోజులను హెలికాప్టర్లు దొరుకుతాయి కాని, ప్రజలను కాపాడేందుకు దొరకవా? అని నిప్పులు చెరిగారు.