హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రైతుల ఆత్మహత్యలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మొద్దునిద్ర పోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాక, రైతుభరోసా లేక పెట్టుబడి సాయం కరువైన పరిస్థితుల్లో ఎందరో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సాయం చేయని కాంగ్రెస్ సర్కారే రైతుల ప్రాణాలను తీస్తున్నదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా బోగస్‌గా మారిందని దు య్యబట్టారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్‌లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా సురేందర్‌రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు భార్యాభర్తలిద్దరిలో ఒకరికీ రుణమాఫీ కాలేదన్న వేదనతో జగిత్యాలలో సాగర్‌రెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ద్రోహానికి ఇంకా ఎందరు రైతులు ప్రాణాలను బలిపెట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.49,500 కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి రైతన్నలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఢిల్లీ యాత్రలు బంద్‌జేసి రైతాం గం కన్నీళ్లు తుడవాలని హితవు పలికారు. హిందీని దేశంలోని అందరిపై రుద్దాలనుకోవడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో అధికారికంగా 22 భాషలు ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హిందీనే అందరికీ రుద్దాలనుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దేశంలోని 22 అధికారిక భాషల్లో హిందీ ఒకటని, ఎందుకు ఆ హిందీనే ఎకువగా మాట్లాడేలా ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు.