పెద్దపల్లి, జూలై 7(నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ కొంగు బంగారం, సిరుల మాగాణం సింగరేణిని బొంద పెట్టడానికే సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పదవిని బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. కిషన్‌రెడ్డి ద్వారా సింగరేణిని ప్రైవేటీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ఈ ప్రక్రియకు స్వయంగా సింగరేణి ప్రాంత ఖమ్మం జిల్లా బిడ్డ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వంత పాడటం విడ్డూరంగా ఉంది. ఏదేమైనా ఐక్య ఉద్యమాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతం’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రఘువీర్సింగ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సరారు కేంద్రానికి సపోర్టుగా నిలుస్తూ, సింగరేణి నష్టాల్లో ఉందని నమ్మించేందుకు విఫలయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఏ ఒక బొగ్గు గనిని కూడా ప్రైవేట్‌పరం కాకుండా కాపాడిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. వేలం ద్వారా గనులు కేటాయించొద్దని 2021 డిసెంబర్ 8న కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం పెట్టి దుర్మార్గమైన కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నారని, సోమవారం జరిగే వేలంలో స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పాల్గొనబోతుండటం విచిత్రమని విమర్శించారు. ఈ వేలంలో సింగరేణికి సంబంధించిన శ్రావణపల్లి కోల్ బ్లాక్ కూడా ఉందని, ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. ఇక్కడి ప్రజలకు బీజేపీ ఇచ్చే తొలి రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అని ప్రశ్నించారు.