హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ) : నాడు కేసీఆర్ దీక్ష చేయకపోయి ఉంటే.. తెలంగాణ ఇవ్వడానికి ఢిల్లీ దిగొచ్చేదా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తన 60 ఏండ్ల పాలనలో ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ‘విజయ్ దివస్’లో భాగంగా తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. నాడు సోనియాగాంధీని బలిదేవత అని సంబోధించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇప్పుడు దేవత ఎలా అయ్యిందని ధ్వజమెత్తారు. పైగా 500మంది పిల్లల చావుకు కారణం కూడా సోనియానేనని సీఎం అన్నారని కొప్పుల గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అని, ‘జై తెలంగాణ అంటే తుపాకీతో కాలుస్తా’ అని ఆనాడు రైఫిల్ పట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కొప్పుల గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా ఇచ్చిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వద్ద ఎంతోమంది అమరులయ్యారని, ఆ మరణాలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ 11రోజులు చేసిన దీక్ష ఫలితంగానే ఆనాడు డిసెంబర్ 9న కేంద్రం ప్రకటన చేసిందని చెప్పారు. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగఫలితమే తెలంగాణ ఏర్పాటుకు కారణమని కొప్పుల స్పష్టం చేశారు.