జగిత్యాల(నమస్తే తెలంగాణ)/ ధర్మపురి జూలై 18 : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు ఎండకూడదని కేసీఆర్ ముందుచూపుతోనే కాళేశ్వం ప్రాజెక్టు నిర్మించారని గుర్తుచేశారు. మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన ఒక పిల్లర్‌ను భూతద్దంలో చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలినట్టు కాంగ్రెస్ నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లి వద్ద ఎండిన అక్కపెల్లి చెరువును శుక్రవారం రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎరువుల కోసం క్యూ కట్టే కాలం మళ్లీ మొదలైందన్నారు. నాట్లు వేసుకునేందుకు ఆరిగోస పడుతున్నారని చెప్పారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 18 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నదని, 10 టీఎంసీలు నీరు తాగునీటికే వినియోగిస్తారని, ఈ పరిస్థితుల్లో పంటలను ఏవిధంగా కాపాడుతారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. చెరువు పనులు పూర్తయితే 5వేల ఎకరాలకు నీరందుతుందని తెలిపారు.