కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 1: ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన వ్యవస్థలను.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా నిర్మించారని, అలాంటి గొప్ప నాయకుడిపై విమర్శలు చేస్తారా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ఆ పార్టీ నాయకులను నిలదీశారు. ఎన్నికల హామీల్లో ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని ప్రశ్నిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అసలు అధికారంలో ఉండి ఏం ఘనకార్యం చేశారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదివారం కరీంనగర్‌లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క గ్రామంలోనైనా రుణమాపీ పూర్తి స్థాయిలో అమలు చేశారా? అని నిలదీశారు. రాష్ట్రంలో 40 శాతానికి మించి రుణమాఫీ కాలేదని చెప్పారు. కేసీఆర్ హయాంలో రూ.16 వేల కోట్లతో 30 లక్షల మందికి, రూ.19 వేల కోట్లతో 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందించామని గుర్తుచేశారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.