ధర్మారం, జూలై 18: ‘కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్‌రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నడు. గోదావరి జలాలు వృథాగా పోతున్నా కావాలనే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోస్తలేడు. సీఎం, ప్రభుత్వం వ్యవహార శైలిపై రైతులు నిలదీయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరువస్తుందోనన్న కుట్రతో రేవంత్‌రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి అసలు రైతులంటే పట్టింపులేదని మండిపడ్డారు. సాగునీటి విషయంలో రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డిని నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచ ఖ్యాతిని సాధిస్తే, కుంగిన పిల్లర్లను మూడేండ్లు అయినా మరమ్మతులు చేయించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ అని ధ్వజమెత్తారు. ఎన్డీఎస్ఏ పేరు చెప్పి మరమ్మతులు చేయించకుండా రైతులను మోసం చేస్తూ కక్ష సాధిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్అండ్టీ కంపెనీ ముందుకొచ్చి మరమ్మతులు చేస్తామని ప్రకటించినా ఎందు కు నిర్లక్ష్యం చేస్తున్నావని ప్రశ్నించారు.