హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎరువుల కొరతతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని, వారిని సీఎం రేవంత్రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రైతులకు సకాలంలో సరిపడా ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్లో రైతుభరోసా లేదు, రుణమాఫీ కాలేదు, చివరకు కనీసం ఒక్క బస్తా యూరియా ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని దుయ్యబట్టారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా కష్టాల్లో ఉన్న రైతులకు రూ.266.50కు దక్కాల్సిన యూరియా బస్తా ధర రూ.325కు పెరిగిందని ఆరోపించారు. ఎరువుల కొరతను ఆసరాగా చేసుకొని కొందరు దళారులు బ్లాక్మార్కెట్లో ఎక్కవ ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిసారించి రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.