ధర్మపురి, డిసెంబర్ 30 : మాయమాటలు, ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడిచిన పరిపాలనపై పట్టు సాధించలేక, అభివృద్ధిని ముందుకు నడిపంచక, సంక్షేమంపై పట్టింపులేక ఘోరంగా వైపల్యం చెందిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) మండిపడ్డారు. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం భవనాన్ని పరిశీలించారు. ధర్మపురిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.8.50కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇంతవరకు అందుబాటులోకి తీసుకురాకపోవడం విడ్డూరమని, ఈ సందర్భంగా ఎంపీహెచ్ భవనం ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్ల పాటు ఉనికిని కోల్పోయిన తెలంగాణకు.. ప్రత్యేక రాష్ట్రంలో ఊపిరిలూదిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కుదేలైన ప్రతి రంగాన్ని వనరులు, శక్తిని కూడదీసుకొని ఆయన సగర్వంగా నిలబెట్టారన్నారు. హామీల అమలులో విఫలమైందని, రాష్ట్రంలో ఖర్చులు ఆదాయాల పట్ల లేకపోవడంతో ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగి సంక్షేమ పధకాలపై ప్రభావం చూపుతోందన్నారు.జిల్లా కేంద్రంలో ఉండవలసిన మాతాళశు కేంద్రాన్ని కేసీఆర్ సహకారంతో ధర్మపురి టెంపుల్ సిటీ అయినందున చుట్టుపక్కల ప్రాంతాల మహిళలకు, పిల్లలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం కోసం ప్రత్యేక చొరవతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం నిర్మించామన్నారు.
రెండుసంవత్సరాల క్రితమే ఈ మాతా శిశుసంరక్షణ కేంద్రాన్ని కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. ఆతర్వాత ప్రభుత్వం మారడంతో దవాఖానను పట్టించుకున్న నాథుడే లేడన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న లక్ష్మణ్ కుమార్ హాస్పిటల్‌ను ఎందుకు అందుబాటులోకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలు ప్రారంభించక పోయినా ఓపిక పట్టామని, ఇప్పుడు నిరసనలు తెలుపుతున్నామని, రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.
త్వరలో హాస్పిటల్ సేవలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యకమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ డా ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, బీఆర్ఎస్ మండల, పట్టణ కన్వీపర్లు అయ్యోరి రాజేష్ కుమార్, బండారి రంజిత్, సంగీ శేఖర్, చిలివేరి శ్యాంసుందర్, వోడ్నాల మల్లేశం, ఎల్లాగౌడ్, బండారి అశోక్, అయ్యోరి వేణు, తరాల కార్తీక్, అనంతుల విజయలక్ష్మి ,యూనుస్, ఆసిఫ్, లక్ష్మణ్ ,మహేష్, జగన్, రాంచందర్, సురేంద ర్, ప్రశాంత్, రిషిరెడ్డి ,ప్రసాద్ తదితరులున్నారు.