హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్సాగర్తో కలిసి శనివారం నిమ్స్‌లో విద్యార్థినిని పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్‌ను అడిగితెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన జ్యోతి, మహాలక్ష్మి నిమ్స్‌లో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, కానీ శైలజ అడ్మిట్ అయినప్పటి నుంచి సీరియస్ కండిషన్లోనే ఉన్నట్టు పేర్కొన్నారు. కిడ్నీ సమస్యతో డయాలసిస్‌పై ఉన్నట్టు ఇప్పటికే పలుమార్లు మాజీ మంత్రి హరీశ్‌రావు వచ్చి డాక్టర్, అధికారులతో మాట్లాడి బాలికకు అన్నిరకాల చికిత్సలు అందించాలని కోరినట్టు గుర్తుచేశారు.
శైలజ పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని, కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదని, ఐసీయూలో కృత్రిమశ్వాస అందిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ విద్యార్థిని శైలజ తన భవిష్యత్తు కలల కోసం పాఠశాలలో చేరగా, నాసిరక భోజనం వికటించి ఇలా కావడం ఆమె కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పురుగుల అన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా, ఫుడ్‌పాయిజన్‌తో చిన్నారులు దవాఖానల పాలైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు.