ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభం కోసం సీసీఐ సాధన కమిటీ అనేక సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐ పునఃప్రారంభ విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ‘హలో యువత చలో సీసీఐ పరిశ్రమ’కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం సీసీఐ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
పరిశ్రమలో స్క్రాప్‌గా మార్చిన ప్రాంతాలను జోగు రామన్న, సీసీఐ సాధన కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కళ్లముందే యువత ఆశలు చెదిరిపోతుంటే అండగా నిలవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వలాభాల కోసం పరిశ్రమను తుక్కుగా మారుస్తున్నాయని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా పరిశ్రమలు లేని వెనుకబడిన జిల్లాగా ఉందని, సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభమైతే వేలాది మంది యువతీ యువకులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కేంద్ర నాయకులు బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్క్రాప్ టెండర్ల వ్యవహారంపై తాము ప్రశ్నించినప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. భూ నిర్వాసితులు తమ భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతుండగా, వందేళ్లకు సరిపడా ముడి సరుకు ఉన్నప్పటికీ పరిశ్రమ పునఃప్రారంభానికి ఒత్తిడి తేవడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ ప్రజలు దీనిపై గట్టి తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శనాల మల్లేష్ సీసీఐ సాధన కమిటీ కన్వీనర్, విజ్జగిరి నారాయణ కో – కన్వీనర్, కొండ రమేష్, బొల్లు ఈశ్వర్, నంది రామయ్య, గోడం గణేష్, వెంకట నారాయణ, అరుణ్ కుమార్, మునిగెల నర్సింగ్, లంక రాఘవులు, లోకారి పోశెట్టి, బండి దత్తాత్రి, జగన్ సింగ్ భూ నిర్వాసితులు కస్తాల అరుణ్, కస్తాల ప్రేమల, ఉగ్గే విట్టల్, నాయకులు పట్టణ అధ్యక్షులు అజయ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్,దాసరి రమేష్, వెనగంటి ప్రకాష్,కొండ గణేష్ దమ్మపాల్, అన్నల వసంత్, పండ్ల శ్రీను, బట్టు సతీష్, తదితరులు పాల్గొన్నారు.