Jeevan Reddy | జగిత్యాల, ఏప్రిల్ 3 : మార్పు రావాలి.. రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ‘మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి’ అన్నారని, తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని, రెండేండ్లలోనే మార్పు రావాలి, రేవంత్‌రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు.
ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకపోవడం, పునరుద్ధరించకపోవడం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని విమర్శించారు. తాను ఏ పార్టీలో చేరాలనేది తన అనుచరులు, అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు తనపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌లు ఒక భాగం మాత్రమేనని, మూడు బరాజ్‌లు పునరుద్ధరించాలంటే రూ.500 కోట్లు మాత్రమే అవుతుందని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్లు నిర్మించి ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రయత్నం చేస్తే.. 152 మీటర్లకు మహారాష్ట్ర అంగీకరించలేదని, ప్రాణహిత గోదావరి కలిసేచోట, 100 మీటర్ల దిగువన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నిర్మించి, వినియోగంలోకి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్మాణ లోపమా? నిర్వహణ లోపమా? కారణం ఏదైనా పిల్లర్లు కుంగిపోయి, రెండేండ్లు గడిచిపోయాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణకే కాదు.. యావత్ రాష్ట్రానికి ఆధారమని పేర్కొన్నారు.
హైదరాబాద్ దాహార్తి తీర్చడంతోపాటు, పారిశ్రామిక అవసరాలకు, మూసీ ప్రక్షాళనకు కూడా కాళేశ్వరంపైనే ఆధార పడాల్సి వస్తుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి బరాజ్ తవ్విన కాలువలను రీ డిజైన్ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోనూ చేర్చిందని, యావత్ తెలంగాణకు ఆధారమైన ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకునేందుకు కనీసం డిజైన్ కూడా రూపొందించలేదని విమర్శించారు. బడ్జెట్లో కేవలం రూ.152 కోట్లు మాత్రమే కేటాయించారని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సమర్పించి ఏడాది గడుస్తున్నా, మేడిగడ్డను పునరుద్ధరించేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. మేడిగడ్డ కాంట్రాక్టర్‌కు మరమ్మతు చేసే బాధ్యత ఉన్నదని, చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ పునరుద్ధరణపై ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తున్నదని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బరాజ్‌ల నిర్మాణ వ్యయం రూ.8 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్మాణాత్మకంగా నీటిని వినియోగించుకునేలా ఆలోచించకపోవడం దురదృష్టకరమని అన్నారు. వాతావరణం అనుకూలించకపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రజల సొత్తు అని చెప్పారు. ఎస్ఎల్బీసీ కుంగిపోయి కార్మికులు మృతి చెందారని, అంతమాత్రాన దానిని వదిలేస్తారా? తిరిగి నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నారు కదా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ పునరుద్ధరణ గురించి ఎందుకు ఆలోచించడం లేదని నిలదీశా రు. రాబోయే రెండేండ్లలో తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాధ్యం కాదని అన్నారు. మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టకపోతే దాదాపు 18 లక్షల ఎకరాలు, హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలు తీరేదెలా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల పునరుద్ధరించకపోతే ఇక్కడి నీళ్లు పోలవరానికి చేరుకుంటాయని తెలిపారు.