భూముల చుట్టూ.. దానితో ముడిపడిన దందా చుట్టూ పరిభ్రమిస్తున్న కాంగ్రెస్ పాలన రైతుకు సంకటంగా మారుతున్నది. రోజుకోచోట భూసేకరణ నోటిషికేషన్‌తో పల్లెలు భీతిల్లుతున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రియల్ పార్కు పేరిట వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూసేకరణకు సర్కార్ సిద్ధమవగా.. తాజాగా దోమ మండలంలోని మూడు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఏకంగా 830 ఎకరాలను సేకరించేందుకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. నేడోరేపో మోత్కూరు పరిధిలో మరో 400 ఎకరాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. శంషాబాద్-లగచర్ల రేడియల్ రోడ్డు సమీపంలోని భూములే లక్ష్యంగా ఈ సేకరణ జరుగుతున్నది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/పరిగి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న చెలగాటం… అమాయక రైతులకు భూ సంకటంగా మారింది. ఇందిరమ్మ రాజ్యంలో దశాబ్దాల కిందట నిరుపేద రైతులకు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ రెండున్నరేండ్లుగా శరవేగంగా సాగుతున్నది. ఓవైపు హైదరాబాద్ మహానగర పరిధిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతుండగా చుట్టూ ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భూసేకరణ పేరిట రైతుల భూములు గుంజుకోవడమే రేవంత్ సర్కార్ యజ్ఞంలా పెట్టుకున్నది. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని పరిగి మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు పేరిట భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే.. తాజాగా దాని పక్కనే ఉన్న దోమ మండలంలోని మూడు గ్రామాల్లో మరో భూసేకరణ పిడుగు పడింది.
ఇక్కడ ఏకంగా 830 ఎకరాల వరకు రైతుల భూముల్ని సేకరించేందుకు రెవెన్యూ శాఖ భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 12.30 ఎకరాలు మినహా మిగిలినవి రైతుల పట్టా భూములే కావడం గమనార్హం. దీంతో వికారాబాద్ జిల్లాలో ఎప్పుడు ఏ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు పేరిట భూ సేకరణ పిడుగు పడుతుందోనని రైతులు కంటి మీద కునుకులేకుండా ఆందోళన చెందుతున్నారు. కాగా ఇవేవో మారుమూల ప్రాంతాల్లో ఉన్న భూములు కూడా కావు. సరిగ్గా శంషాబాద్-లగచర్ల రేడియల్ రోడ్డుకు సమీపంలోని భూములు కావడంతో అభివృద్ధి ఫలాలను అనుభవించాల్సిన రైతులు ఇప్పుడు బజారున పడే దుస్థితి నెలకొన్నది.
వికారాబాద్ జిల్లాలో లగచర్ల గాయాలు ఇంకా ఆరకముందే ఇతర ప్రాంతాల్లోని అన్నదాతల చుట్టూ భూసేకరణ ఉచ్చు బిగుస్తూనే ఉన్నది. ఇప్పటికే పరిగి మండ లం కాళ్లాపూర్, రాపోలు గ్రామాల పరిధిలో 1,197 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. కాళ్లాపూర్ పరిధిలో సేకరించే భూముల్లో 428.05 ఎకరాల అసైన్డ్ భూములుండగా, 159.25 ఎకరాల పట్టా భూములున్నాయి. రాపోలు పరిధి లో 509 ఎకరాల అసైన్డ్, 101.08 ఎకరాల పట్టా భూములున్నాయి. అంటే ఈ రెండు గ్రామాల్లో పూర్తిగా సన్న, చిన్నకారు రైతులకు జీవనాధారంగా వస్తున్న భూము లే. దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ రైతులకు ఒక్కసారిగా భూసేకరణ నోటిఫికేషన్ రావడంతో కంటి మీద కునుకు లేకుండా పోయింది.
తమ కుటుంబాలకు ఉన్న ఆధారాన్ని గుంజుకొని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చేతుల్లో పెడితే ఎలా బతకాలి? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల రైతులు వందలాది మంది 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం రైతులకు మద్దతు తెలిపి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి రైతులకు అండగా నిలిచి పోరాటంలో భాగస్వాములయ్యారు. ఒకవైపు ఇక్కడ వందలాది మంది రైతులు ఆందోళన చేస్తుండగానే మరో మూడు గ్రామాలపై ప్రభుత్వం భూసేకరణ పిడుగు వేసింది.
కొన్నిరోజుల కిందట రెవెన్యూ శాఖ దోమ మండల పరిధిలోని మరో మూడు గ్రామాల్లో ఏకంగా 830 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. కొండాయిపల్లిలో 371.24 ఎకరాల పట్టా భూమి, అంతారెడ్డిపల్లిలో 209.03 ఎకరాల పట్టా భూమితో పాటు బట్లచెన్నారంలో 235 ఎకరాల పట్టా భూమి, 12.30 ఎకరాల అసైన్డ్ భూముల్ని తీసుకోనున్నట్టు అందు లో పేర్కొన్నారు. టీజీఐఐసీ ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కు కోసం ఈ భూముల్ని సేకరిస్తున్నట్టు వెల్లడించారు. మొత్తంగా 815.27 ఎకరాల పట్టా భూమిని రైతుల నుంచి తీసుకొని పరిశ్రమలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ సర్కార్ భూదాహం వీటికే పరిమితం కానట్టుగా తెలుస్తున్నది. రేపోమాపో మండలంలోని మోత్కూరులోని 400 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుండటంతో అక్కడ వందలాది మంది రైతుల్లో ఆందోళన మొదలైంది.
మా గ్రామంలో సాగు భూములను గుంజుకొనేందుకు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 235 ఎకరాల పట్టాభూమి, 12.30 ఎకరాల లావణి భూములు లాక్కొని కంపెనీలు పెడుతారట. మా గ్రామంతోపాటు కొండాయిపల్లి, అనంతరెడ్డిపల్లిలోనూ భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఉద్యోగాలు లేక హైదరాబాద్‌లో ఉండి పనిచేసుకుంటూ, ఇటీవలే ఊళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నం. మొదట రేడియల్ రోడ్డు పేరిట భూములు సర్వే చేసి, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కు పేరిట భూ సేకరణకు సిద్ధమైండ్రు. మాకు మేకలు, పశువులున్నయి. కూరగాయలు, ఇతర పంటలు సాగు చేసుకుంటున్న భూమి గుంజుకుంటే మేము ఎక్కడికి పోవాలి? మా భూములు ఇచ్చేది లేదు. భూములు కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం. మేము చేసే పోరాటానికి మద్దతు ఇవ్వండి. ఇదంతా రేవంత్ సర్కార్ చేస్తున్న భూ దందా.. ఎమ్మెల్యే చాటుగా దాక్కొని ఇలాంటివి చేయడం కాదు.. ముందుకొచ్చి మాట్లాడాలి.
– తిరుమలేశ్, రైతు, బట్లచందారం, దోమ మండలం