చివ్వెంల, మార్చి 26 : దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. ఈ మూడే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. పంటలు ఎండి రైతులు గోస పడుతున్నా పట్టించుకునే తీరిక ఈ సర్కార్‌కు లేదని ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనని స్పష్టంచేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం గ్రామంలో ఎండిన పొలాలను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తూ రాక్షసానందం పొందుతున్నదని దుయ్యబట్టారు.
పదేండ్లు ప్రశాంతంగా ఉన్న రైతాంగానికి మళ్లీ కన్నీళ్తు తెప్పిస్తున్నదని విమర్శించారు. పొట్టకొచ్చి పంటకు నీళ్లు లేక పశువుల మేతకు వదిలి పెట్టే పరిస్తితి వచ్చిందని ఆవేదన వ్యక్త చేశారు. కనీసం ఒక తడి ఇస్తే సగం పంటైనా దక్కేదని, రెండు తడులు ఇస్తే అప్పుల తిప్పలు ఉండేవి కావని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాకముందే అన్ని రంగాల్లో ఇంత నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఎకరం కూడా ఎండిపోలేదని, కాం గ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రెండు సార్లు యాసంగి పంటలు ఎండిపోయాయని గుర్తుచేశారు. కాళేశ్వరం కాకుండా ఎస్సారెస్పీ నీళ్లే అయితే ఇప్పుడు పంటలు ఎందుకు ఎండుతున్నాయో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తమకు అప్పగిస్తే ఎకరం కూడా ఎండిపోకుండా కాపాడుకుంటామని చెప్పారు.
నేను యాభై ఏండ్ల సంది వ్యవసాయం చేస్తున్న. ఆరేండ్లల్లో చూసిన నీళ్లను ఎప్పుడూ చూడలే. ఇగ నీళ్లకు కొదువ లేదనుకున్నం. అయ్యా.. జగదీశ్ రెడ్డి సారూ… కేసీఆర్ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చాలా బాగుండే. పొలాలు కోసేనాటికి కూడా మడులల్ల నిండా నీళ్లు ఉండేవి. పొలాలు కొయ్యాల్నంటే కోత మిషన్లు దిగబడేవి. ఇయ్యాల నీళ్లు లేక మా బతుకులు ఆగమైనయ్. ఎండిన పొలాలకు నష్టపరిహారం ఇప్పించాలి.