Jadish Reddy | కాంగ్రెస్ రుణమాఫీ మోసం, బీజేపీ డీలిమిటేషన్ కుట్రలపై సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. అసెంబ్లీ అనే సోయి లేకుండా అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి చేతులెత్తేసిందన్నారు. చేయని రుణమాఫీ చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అమలు సాధ్యం కాదని తెలిసి అబద్ధపు హామీలిచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ముందు బ్యాంకులకు వెళ్లండని రైతులతో రుణాలెత్తించి.. నట్టేట ముంచారని మండిపడ్డారు. బ్యాంకుల లెక్క ప్రకారం రూ.49,500 కోట్లు.. కాంగ్రెస్ చెప్పేది రూ.20వేలు కోట్లని.. కానీ చివరకు మాఫీ చేసింది రూ.12,500 కోట్లు మాత్రమేనన్నారు. బ్యాంకులు చెప్పిన దానికి కేబినెట్, బడ్జెట్, అసెంబ్లీకి వచ్చే సరికి 30శాతం కూడా మాఫీ కాలేదన్నారు.
చెప్పిన హామీలు ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారని.. రుణమాఫీ పోయిందని.. బొనస్ లేదని.. సాగునీళ్లు కూడా లేవన్నారు. అన్నింటికీ మొండి చేతులే చూపిస్తున్నారని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా ఉందని.. అందుకే సంక్షేమం మరచి జేబులు నింపుకుంటున్నారన్నారు. అసెంబ్లీలో మంత్రులు అబద్ధాలు చెప్పిన సందర్భం చరిత్రలోనే ఎప్పుడూ జరుగలేదని.. అసెంబ్లీలో అబద్ధాలాడిన రికార్డు కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందని ఎద్దేవా చేశారు. ప్రజలకిచ్చిన హామీల బాధ్యత పూర్తిగా మరిచారని.. అసమర్థ ప్రభుత్వాన్ని ఎలా భరించాలని ప్రజలు ఆవేదన పడుతున్నారన్నారు. బడే భాయ్ దగ్గర మాట తీసికుని ఛోటే బాయ్ మ్యాచ్ ఫిక్సింగ్.. కిషన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా వ్యతిరేకత వస్తుందని.. కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడితే చివరకే మోసమే ఎదురవుతుందన్నారు. బీజేపీ కుట్రలు ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమన్నారు. ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలంటే రాష్ట్రాల ఐక్యత ముఖ్యమని.. తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.