హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తేతెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. సర్కారు నిర్లక్ష్యం విద్యార్థులు, యాజమాన్యాలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. సరైన భోజనం, మౌలిక వసతుల లేమితో విద్యార్థులు, ఆర్థిక ఇబ్బందులతో యాజమాన్యాలు సతమతమవుతున్నాయని వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చిన యజమానులు.. అవి చెల్లించలేక, ఈఎంఐలు కట్టలేక బ్యాంకర్లకు ముఖం చాటేస్తూ సతమతమవుతున్నారని పేర్కొన్నారు. అప్పుల భారం భరించలేక వనపర్తిలో ఓ యజమాని ఆత్మహత్య చేసుకున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. ‘విద్యకు మా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని మీరు చెప్పే మాటలు డొల్లేనని అర్థమవుతున్నది.. నిర్లక్ష్య వైఖరికి అద్ధంపడుతున్నది.’ అని తూర్పార బట్టారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుమార్చకుండా ఈ పథకాన్ని కొనసాగించడమే కాకుండా.. స్కూల్లోని విద్యార్థుల సంఖ్యను 80 నుంచి 150కి పెంచి ఏటా 25 వేల మంది చదువుకునేలా విస్తరింప చేసిందని పేర్కొన్నారు. డే స్కాలర్ స్టూడెంట్స్‌కు రూ. 8 వేల నుంచి రూ. 20 వేల వరకు, హాస్టల్ విద్యార్థులకు రూ. 20 వేల నుంచి రూ. 42 వేలకు పెంచిందని గుర్తుచేశారు. ఎందరో విద్యార్థులను ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందేలా తీర్చిదిద్దిందని తెలిపారు. ఏటా రూ.130 కోట్ల చొప్పున ఖర్చుచేశామని ప్రస్తావించారు. 2023-24లో మొదటి విడత రూ. 50 కోట్లు విడుదల చేశామని, ఎన్నికల కోడ్ కారణంగా రెండో విడత ఇవ్వలేకపోయామని తెలిపారు. కానీ ముఖ్యమంత్రిగానే కాకుండా విద్యామంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి, 2023-24 విద్యా సంవత్సరం నిధులను ఇప్పటివరకు విడుదల చేయకపోవడం విచారకరమని వాపోయారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ధీనస్థితి గురించి గతేడాది ఆగస్టులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లేఖ రాసిన, యాజమాన్యాలు వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రెండేండ్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.